సాధారణంగా మన హిందూ దేవతార్చనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజా విధానంలో మంగళహారతి చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు. మంగళ హారతి లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అవుతుంది. ప్రతిరోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దీపం లేదా దీపాలు వెలిగించి పూజా విగ్రహానికి తిప్పుతూ హారతిని ఇస్తూ ఉంటారు. ఈ ప్రక్రియను హారతి లేదా నీరాజనం అని అంటారు. అత్యంత భక్తితో, విశ్వాసంతో చేసే హారతి ఆరాధనకు పూర్తి ఫలితాన్ని ఇస్తుందని ప్రజల విశ్వాసం. అయితే పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత హారతి ఇచ్చే సమయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా ఇంట్లో దేవుడి పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని ప్రజల విశ్వాసం. అయితే ప్రతిరోజు ఇంట్లో పూజ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. అయితే హారతి ఇచ్చేముందు పూజా పళ్లెంలో పసుపు, కుంకుమతో స్వస్తిక్ వేసి అందులో పూలు సమర్పించిన తర్వాత పళ్లెంలో దీపం పెట్టి హారతి ఇవ్వాలి. అలాగే హారతి ఇచ్చేముందు ఇచ్చిన తరువాత శంఖాన్ని ఉదాలి. వీలైతే హారతి ఇచ్చే సమయంలో ఓం అక్షరం ఆకారంలో ప్లేటును తిప్పడానికి ప్రయత్నించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
హారతి ఇచ్చిన తర్వాత దేవుళ్ళ ముందు హారతి పల్లాన్ని దేవుళ్ళ పాదాల వైపు నాలుగు సార్లు, నాభి వైపు రెండుసార్లు, ఆ తర్వాత దేవుళ్ళ ముఖం వైపు ఒకసారి హారతి చూపించాలి. ఇలా ఏడుసార్లు తప్పనిసరిగా చేయాలి. అలాగే కొంతమంది మట్టి ప్రమిదలలో దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత తిరిగి ఆ దీపాలను మరుసటి రోజు హారతి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. మట్టి ప్రమిదలలో హారతి ఇవ్వాలనుకున్నవారు కొత్త ప్రమిద ఉపయోగించి హారతి ఇవ్వాలి. అలాగే మరికొంతమంది ఇత్తడి దీపాలతో దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. ఇతర దీపాలను ప్రతిరోజు శుభ్రం చేసిన తర్వాతే దేవుడికి హారతి ఇవ్వాలి. దేవుడుకి హారతి ఇచ్చే సమయంలో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.