అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిన మహిళలు?

దేశంలో ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగులుస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఎటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యం వల్ల ఆసుపత్రికి వెళుతున్న ఇద్దరు మహిళలు నిమిషంలో ఆసుపత్రికి చేరుకుంటారు అనగా అనుకోని ప్రమాదం వల్ల మృత్యువాత పడ్డారు.

వివరాలలోకి వెళితే…రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తుమ్మలకుంటతండా గ్రామ పంచాయతీ కోమటికుంట తండాకు చెందిన పాత్లావత్‌ చిలుకమ్మ(30), మూడావత్‌ మౌనిక(20) అనే ఇద్దరు మహిళలు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తమ బంధువు అయిన మూడావత్ కుమార్ సహాయంతో ఇద్దరు అతని ద్విచక్ర వాహనం మీద తలకొండపల్లిలోని ఆసుపత్రికి బయలుదేరారు. నిమిషంలో ఆసుపత్రికి చేరుకుంటామని అనుకునేలోపే ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని దాటే క్రమంలో వీరు వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో చిలుకమ్మ, మౌనిక ఇద్దరూ కూడా ద్విచక్ర వాహనం నుండి కింద పడిపోయారు.

ఎదురుగా వస్తున్న డీసీఎం చిలకమ్మా మౌనిక మీద నుండి వెళ్లడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అనారోగ్యంగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్న వీరు అనుకోని ప్రమాదం వల్ల అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఒకేసారి ఇద్దరు మరణించడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.