కొత్త ప్రియుడితో కలిసి పాత ప్రియుడిని ఖతం చేసింది

ఈ 18 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు యువకులను ప్రేమించింది. ఒకేసారి ఇద్దరు యువకులను ప్రేమించిన ఈమె కొత్త ప్రియుని సాయంతో పాత ప్రియున్ని చంపేసింది. పాత ప్రియుడి గురించి కొత్త ప్రియుడు నిలదీయడంతో పాత ప్రియునిపై లేనిపోని నిందలు మోపింది. అబద్దం చెప్పి కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి పాత ప్రియుడిని మట్టుబెట్టారు.

ఒక హత్య కేస్ ను విచారణ జరిపిన షాద్ నగర్ పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. ఈ నెల 20న షాద్ నగర్ లో హత్యకు గురైన శేఖర్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అసలు స్టోరి ఏంటంటే…

ఫరూక్‌ నగర్‌ మండలం గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్‌ (24), పర్వీన్‌ బేగం (18) మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 8 నెలల క్రితం గుండుగేరికి ఉపాధి నిమిత్తం వచ్చిన తోళ్ల వ్యాపారి మహమ్మద్‌ ఆసిఫ్‌ ఖురేషీ (23)తో పర్వీన్ కు పరిచయం కాగా, అతన్ని కూడా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు.

ఈ సమయంలోనే శేఖర్, పర్వీన్ ప్రేమించుకున్న విషయం ఆసిఫ్ కు తెలిసింది. ఈ విషయంలో పర్వీన్ ను ఆసిఫ్ నిలదీశాడు. దీంతో శేఖర్ తన వద్ద రూ. 4,500 అప్పు తీసుకున్నాడని, దాన్ని ఇవ్వకుండా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పర్వీన్ అబద్ధాలు చెప్పింది. కోపోద్రిక్తుడైన ఆసిఫ్… ఇద్దరం కలసి శేఖర్ ను చంపాలని ప్లాన్ వేశారు. 

అక్టోబర్ 19వ తేదీ రాత్రి శేఖర్ ను తన ఇంటికి రప్పించిన పర్వీన్, మద్యంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. శేఖర్ మత్తులోకి జారుకోగానే, ఆసిఫ్ సాయంతో శేఖర్ గొంతుకోసి చంపేసింది. మృతదేహాన్ని అక్కడే ఇళ్ల మధ్య పడేసి, హైదరాబాద్ కు వచ్చారు. ముంబైకి పారిపోవాలనుకొని షాద్ నగర్ కు వచ్చారు.

షాద్ నగర్ లో వీరిద్దరు అనుమానంగా తచ్చాడుతూ తిరుగుతున్నారు. అప్పటికే శేఖర్ హత్య పై కేసు నమోదు చేసిన పోలీసులు పర్వీన్ ను అనుమానితురాలిగా కేసులో చేర్చారు. పర్వీన్ కనపడటంతో అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు నిజం బయటపడింది.

అసిఫ్ మీద గతంలో నేర చరిత్ర ఉన్న దృష్ట్యా పీడి యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.