వారిద్దరు పది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 8 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా భర్త తనువు చాలించాడు.
హైదరాబాద్ విజయ్ నగర్ కాలనీకి చెందిన ప్రభువు రాణి అనే అమ్మాయిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వినేష్ అనే 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇటీవల రాణికి, ప్రభువుకు గొడవలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం రాణి కుమారుడిని విడిచి పెట్టి పుట్టింటికి వెళ్లింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ లో భర్త అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని కేసు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభువు మానసికంగా కుంగి పోయినట్టు తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల నుంచి ఆయన డల్ గా ఉన్నారని స్నేహితులు తెలిపారు.
వినేష్ నాలుగవ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ కు వెళుతున్న కొడుకును ప్రభువు ట్యూషన్ కు పోనివ్వకుండా ఆపాడు. చివరి సారిగా కొడుకుకు అన్నం కలిపి ప్రేమగా తినిపించాడు. అతనితో సరదాగా ఆడుకున్నాడు. అతనికి జోలపాడి నిద్రపుచ్చాడు. వినేష్ నిద్రపోగానే ప్రభువు హాల్లోకి వెళ్లి చీరతో ఉరివేసుకున్నాడు. వినేష్ ఉదయం నిద్రలేచి చూసే సరికి ప్రభువు వేలాడుతూ కనిపించాడు. దీంతో భయంతో వినేష్ గట్టిగా కేకలు పెట్టగా ఇరుగుపొరుగు వారు గమనించి తలుపులు తీసి పోలీసులకు సమాచారమందించారు.
భార్య భర్తలు ఇద్దరు జాబ్ లు చేసేవారని చాలా బాగుండేవారని స్థానికులు అంటున్నారు. అయితే ప్రభువు బంధువులు మాత్రం పలు ఆరోపణలు చేశారు. రాణికి తన బావతో వివాహేతర సంబంధం ఉందని అప్పటి నుంచే ప్రభువుతో తరచు గొడవలు పడుతుందని ఆరోపించారు. నాన్న చనిపోయాడని 8 సంవత్సరాల బాబు అందరికి ఫోన్ లో చెప్పడం అందరిని కంటతడి పెట్టించింది. మృతుని వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.