పెళ్లై మూడు రోజులు కూడా గడువలేదు. ఆ నవ వధువు కాళ్ళ పారాణి ఆరలేదు. తనతో జీవితం పంచుకోనున్న భర్తతో మనస్సు విప్పి మాట్లాడనే లేదు. ఇంతలోనే హీటర్ రూపంతో ఆ పెళ్లి కూతురు ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది.
సికింద్రాబాద్ కళాసిగూడలో నివసించే పరమేశ్వర్, షీమాదేవిల రెండో కూతురు మనీషా. మనీషాకు ఈ నెల 22న నాంపల్లికి చెందిన కృష్ణ శర్మతో ఘనంగా వివాహం జరిపించారు. వివాహం తర్వాత జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 25న మనీషా తన తల్లిగారింటికి వచ్చింది. స్నానం చేసేందుకు హీటర్ వేసి నీళ్లు కాగబెట్టుకుంది.
నీళ్లు వేడి అయ్యాయో లేదో చూసేందుకు ప్రయత్నించిన మనీషా హీటర్ స్విచ్ఛాఫ్ చేయకుండానే హీటర్ ను బయటికి తీసింది. హీటర్ ప్రమాదవశాత్తు మనీషాకు తగిలింది. దీంతో మనీషాకు కరెంట్ షాక్ తగిలింది. ఇంతలోనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మనీషా చనిపోయింది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగి పోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.