హీరో బాలయ్య ట్రాఫిక్ ఫైన్ కట్టలేదింకా…

సినిమా హీరోలు నటన నుంచి అంతతొందరగా నిజజీవితంలోకి రాలేరు. సినిమాల్లో కార్లను అతివేగంగా నడపడం, పల్టీలు కొట్టించడం, అలవోకగా దూకడం… ఇలా ఎన్నో సాహసకృత్యాలు చేస్తుంటారు. అపుడపుడు నిజజీవితంలో కూడా రోడ్ల మీద ఇలాంటి సాహస్య కృత్యాలు చేస్తుంటారు. దొరికి పోతుంటారు. పోలీస్ రికార్డులను పరిశీలిస్తే చాలా మంది హీరోలు సినిమాల్లో లాగే హైదరాబాద్ రోడ్ల మీద కూడా మితిమీరిన వేగంతో కార్లను నడిపి ట్రాపిక్ నియమాలు ఉల్లంఘించి పోలీసులకు దొరికి పోయిన సంఘటనలు చాలా కనిపిస్తాయి.

ఇలా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినవ వారిలో పెద్ద హీరోలు కూడా ఉన్నారు. పోలీస్ వెబ్ సైట్ మీద ఒక లుక్కేస్తే చాలా ఆసక్తి కరమయిన విషయాలు బయటపడతాయి. ఈ జాబితాలో బాలకృష్ణ, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, సునీల్,నితిన్ వంటివారున్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ నియమాలను ఖాతరు చేయనందుకు వీరందరికి చలాన్ పడింది. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లు చలాన్ చెల్లించారు. బాలకృష్ణ, నితిన్ ఇంకా చెల్లించలేదు.

2018 మే 1 న రాజేంద్ర నగర్ లోని చెన్నమ్మ హోటల్ వద్ద మితిమీరిన వేగంగా AP36Q0001 నెంబర్ కారు అతివేగంగా ప్రయాణించింది. ఇది హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కారు. ప్రమాదకరమయిన వేగంతో ప్రయాణించింనందుకు ఆయనకు రు.1035 ఫైన్ వేశారు. అయితే, ఆయన ఇంకా ఫైన్ చెల్లించలేదు. డేంజరస్ గా కారు నడిపినందుకు AP09CT2233 కారు మీద మీద ఫైన్ వేశారు. ఇది నితిన్ కారు. అక్టోబర్ 2018 లో అల్వాల్ లో ఈ కారును ప్రమాదకరమయిన వేగంతో నడిపారు. దీనికి గాను ఆయనకు రు.1035 ఫైన్ పడింది. అదింకా చెల్లించలేదు. హీరో మహేష్ బాబు మీద చాలా సార్లు వోవర్ స్పీడ్ చలాన్ పడింది. AP09CM 4005 అనేకారు ఘట్టమనేని మహేష్ బాబు పేరు మీద ఉంది. 2016 నుంచి ఇప్పటిదాకా ఆయన కారు వోవర్ స్పీడ్తో వెళ్లినందుకు ఏడు సార్లు ఫైన్ పడింది. అయన అన్నింటిని చెల్లించారు. అయితే, 2015 లో జారీ చేసిన చలాన్ పెండింగ్ లో ఉందని పోలీస్ వెబ్ సైట్ చెబుతూ ఉంది.

పవన్ కల్యాణ్ కారు AP09CG7778 మీద ఇంతవరకు మూడుసార్లు వోవర్ స్పీడ్ కు సంబంధించిన చలాన్ లు వేశారు. అయితే, ఆయన వాటన్నింటికి ఆయన ఫైన్ చెల్లించారు.నటుడు ఇందుకూరి సునీల్ వర్మ కూడా మూడు సార్లు వోవర్ స్పీడ్ తో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించారు. రు. 4540 ఫైన్ కట్టారు.