పుట్టింటి నుండి రావడానికి నిరాకరించిన భార్య.. కోపంతో రగిలిపోయిన భర్త ఏం చేశాడో తెలుసా..?

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవటం వల్ల ఈ చిన్న చిన్న సమస్యలను దూరం చేసుకోవచ్చు. కానీ కొంతమంది మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా రాద్ధాంతం చేస్తూ గొడవలు పెద్దవి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఆగ్రహానికి గురై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల భార్య పుట్టింటికి నుండి రానన్నందుకు కోపోద్రిక్తుడైన భర్త దారుణానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. పుట్టింటి నుండి రావటానికి భార్య నిరాకరించినందుకు ఏకంగా పెట్రోల్ పోసి ఆమెను సజీవ దహనం చేయాటానికి పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే… మధ్యప్రదేశ్ సెహోర్‌లోని కస్బా చౌకీ ప్రాంతానికి చెందిన దీక్షకి ఉజ్జయినికి చెందిన రాజేష్ మాల్వియాతో 2016 లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటివరకు పిల్లలు కలగలేదు. వివాహం జరిగిన తర్వాత కొంతకాలం సాఫీగా సాగిపోయిన వీరి జీవితంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజేష్ భార్యతో గొడవ పడుతూ ఆమెను కొట్టేవాడు. భర్త పెట్టే వేధింపులు భరించలేక దీక్ష ఏడాది క్రితం తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే పుట్టింటి నుండి తిరిగి రమ్మని రాజేష్ ఎన్నిసార్లు కోరిన దీక్ష నిరాకరిస్తూ వచ్చింది. ఇటీవల కూడా రాజేష్ తన భార్యను పుట్టింటి నుండి తిరిగి రమ్మని కోరాడు.

ఆమె నిరాకరించటంతో రాజేష్ దీక్ష మీద దాడి చేయగా ఆమె తలకు గాయమైంది. ఇలా దాడి చేయడంతో దీక్ష తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇటీవల రాజేష్ మళ్లీ దీక్ష వద్దకు వెళ్లి గొడవ పెట్టుకుని తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ దీక్ష మీద పోసి నిప్పంటించి అక్కడినుండి పారిపోయాడు. మంటలలో కాలుతూ గట్టిగా కేకలు వేస్తున్న దీక్షని గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పీ ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీక్ష పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు రాజేష్ ని అదుపులోకి తీసుకున్నారు.