చెరువులో పడిమృతి చెందిన కొడుకు.. కొడుకును బ్రతికించడం కోసం కన్న పేగు పడిన ఆరాటం తెలిస్తే కన్నీలాగవు?

కొన్ని సందర్భాలలో మృత్యువు ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరు ఊహించలేరు. కొన్ని అనుకోని పరిణామాల వల్ల నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు ఇలా మృత్యువాత పడుతున్నారు. దీంతో పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లి తండ్రులకు తీరని శోకం మిగులుతుంది. ఇటీవల ఇలాంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. బళ్ళారి జిల్లాలో బాలుడు ఈతకు వెళ్లి నీటిలో మునిగి మరణించాడు. అయితే కొడుకుని మరల బ్రతికించాలని తల్లితండ్రులు ఆ బాలుడి మృతదేహాన్ని గంటల కొద్దీ ఉప్పుతో కప్పి ఉంచారు.

వివరాలలోకి వెళితే…కర్ణాటకలోని బళ్లారి జిల్లా,
సిర్​వారా అనే గ్రామానికి చెందిన బాలుడు ఇటీవల తన స్నేహితులతో కలిసి సరదాగా దగ్గరలో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే చెరువులోకి ఎక్కువగా ఉండటంతో బాలుడికి సరిగా ఈతరాక నీటిలో మునిగి మరణించాడు. ఈ విషయాన్ని బాలుడి స్నేహితులు అతని తల్లిదండ్రులకు తెలియజేయగా.. బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన చెరువు దగ్గరికి చేరుకొని తమ కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆ బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరు అచేతనంగా పడి ఉన్న తమ కుమారుడి మృతదేహం మీద పడి బోరున విలపించారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇలా కళ్లెదుట శవమై కనిపించటంతో ఆ తల్లిదండ్రులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో గతంలో ఎవరో చెప్పిన విషయం గుర్తుకు వచ్చి నీటిలో మునిగి చనిపోయిన వారిలో మృతదేహాన్ని ఉప్పులో ఉంచితే ప్రాణాలు తిరిగి వస్తాయన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఐదు బస్తాల ఉప్పు తెప్పించారు. ఆ తర్వాత ఉప్పు మొత్తం పోసి బాలుడు మృతదేహాన్ని అందులో ఉంచి దాదాపు కొన్ని గంటలపాటు బాలుడు తిరిగి బ్రతుకుతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే గంటలు గడిచినా కూడా బాలుడిలో ఎటువంటి చలనం లేకపోవడంతో స్థానికుల సలహా మేరకు బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.