సాప్ట్ వేర్ భార్య ఎఫైర్, సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్… బయటపడ్డ సంచలన నిజాలు

పంజాగుట్టలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రశాంత్ భార్య పావని బహిరంగంగా తాను ప్రణయ్ అనే వ్యక్తితో తిరుగుతున్నానని, తనతో సహజీవనం చేస్తున్నానని చెప్పినట్టు బయటపడింది. ఏం చేసుకుంటావో చేసుకో అతనితో కలిసి ఉంటానని తెగేసి చెప్పటంతోనే ప్రశాంత్ మానసిక క్షోభకు గురైనట్టు బయటపడింది. పావని తప్పు చేసిందని తెలిసినా కూడా ఇప్పటికైనా మారాలని మంచిగా కలిసి బతుకుదామని ప్రశాంత్ పావనిని కోరినా ఆమెలో మార్పు రాలేదని తెలిసింది.

ప్రశాంత్ తాను చనిపోవడానికి వారం ముందు తన బావకు ఫోన్ చేసి తాను చనిపోతానని తనకు బతకాలని లేదని ఫోన్ లో చెప్పాడు. అవమాన భారంతో బతకలేనని, తాను చనిపోతే కనీసం ప్రశాంతంగానైనా ఉంటానని ఫోన్ లో మాట్లాడాడు. ప్రశాంత్ మాటలతో అతని బావ నువ్వు చచ్చి ఏం సాధిస్తావు… ఒక ఆడది బహిరంగంగా తాను తప్పు చేశానని చెప్పాక ఆడిదానికి అంత ఉంటే మగాడివి నీకెందుకురా భయం … కోర్టులో తేల్చుకున్నాక ఆలోచిద్దాం.. అటువంటి ఆలోచనలు వద్దు… జీవితం ఏం అయిందని నీవు తప్పు చేయలేదు. అంటూ ధైర్యం చెప్పాడు. ఇప్పుడీ  ఆడియో బయటపడింది.  

పావనికి పెళ్లికి ముందే ప్రణయ్ అనే యువకునితో పరిచయం ఉంది. పెళ్లయ్యే వరకు కూడా తాము ఫ్రెండ్స్ గానే ఉండేవారమని, తన పెళ్లి అయ్యి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా పిల్లలు కాకపోవడంతోనే ప్రణయ్ తో సంబంధానికి దారితీసినట్టు పావని పోలీసుల విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లాకు చెందిన తిరునగరి ప్రశాంత్ సిలికాన్ ఇమేజ్ సాప్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి 2014లో వరంగల్ జిల్లాకు చెందిన పావనితో వివాహం జరిగింది. వీరు శ్రీనగర్ కాలనీలోని పద్మజ మెన్షన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. పావని కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. పావనికి మూడు నెలల క్రితమే బెంగళూరులో జాబ్ రావడంతో ఆమె అక్కడకు వెళ్లింది.

పావని బెంగళూరులో జాబ్ చేస్తూ సెలవు రోజుల్లో హైదరాబాద్ వచ్చి వెళ్లేది. పావని హైదరాబాద్ లో పనిచేసినప్పుడే ప్రణయ్ అనే యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రశాంత్ కు తెలిసింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలయ్యాయి. పెద్దలు నచ్చ చెప్పడంతో ఒక్కటయ్యారు. అయినా కూడా పావని ప్రవర్తనలో మార్పు రాలేదు. చాలాసార్లు ప్రశాంత్ పావనిని హెచ్చరించాడు.

ఇటీవల పావని బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అయి వెళ్లి పోయింది. పావని వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ప్రణయ్ కూడా బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ పై వెళ్లి పోయాడన్న విషయం ప్రశాంత్ కు తెలిసింది. వీరిద్దరు అక్కడ కాపురం పెట్టి తనను నమ్మించేందుకు సెలవు దినాల్లో పావని హైదరాబాద్ వచ్చి వెళ్తుందని ప్రశాంత్ మానసిక క్షోభకు గురయ్యాడు.  

తన భార్యకు ఎన్ని సార్లు చెప్పినా మారలేదని తాను హైదరాబాద్ లో ఉంటే అడ్డుగా ఉంటానని భావించి బెంగళూరు కు వెళ్లి అక్కడ ఏకంగా కాపురమే పెట్టిందని ప్రశాంత్ సూసైడ్ నోట్ లో రాశాడు. తనకు జీవితం పై విరక్తి చెందిందని పావనికి ఎన్ని సార్లు చెప్పినా మార్పు రాలేదని లేఖలో బాధను వ్యక్తం చేశాడు. పావని వైఖరి వల్లే తాను చనిపోతున్నానని ప్రశాంత్ లేఖలో పేర్కొన్నాడు.

కాగా, ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన పావనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో నచ్చజెప్పినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పావనిని రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.