ప్రస్తుత కాలంలో ప్రభుత్వ అధికారుల నుండి పనులు చేయించుకోవటానికి లక్షల్లో లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు లంచం ఇస్తే తప్ప పనిచేయడం లేదు. ఇలా లంచం ఇచ్చిన కూడా కొంతమంది అధికారులు రైతులకు పని చేయకపోవడంతో వారు మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . ఇటీవల తిరుపతిలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. లంచం తీసుకున్న ప్రభుత్వ అధికారి తమకి పాసు పుస్తకాలు పంపిణీ చేయలేదన్న మనస్తాపంతో దంపతులిద్దరూ తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటన ప్రస్తుతం తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాలలోకి వెళితే…సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన నాగార్జున, భవానీ దంపతులు ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన ‘స్పందన’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చిట్టమూరు తహసీల్దార్‌గా పనిచేసిన చంద్రశేఖర్ పాసు పుస్తకాలు జారీ చేస్తానని చెప్పి రైతుల వద్ద నుండి రూ.1.5కోట్లు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఆవరణలోనే భవానీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకి ప్రయత్నించగా నాగార్జున చేయి కోసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు వారిని గమనించి తిరుపతి రుయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉంది.
నాగార్జున, భవాని చేసిన ఆరోపణలపై కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించాడు. గతంలో ఈ దంపతులు సదరు తహసిల్దార్ మీద ఆరోపణలు చేయడంతో నెల్లూరు కలెక్టరేట్ నుండి అతన్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆ తహసీల్దార్ పై తిరుపతి కలెక్టరేట్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సదరు తహసీల్దార్‌పై విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే తహసిల్దార్ కి రూ.కోటిన్నర లంచం ఇచ్చినట్లు బాధితుల వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఈ విషయంపై మరొకసారి విచారణ జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు.