సినిమా ప్రభావం నిజ జీవితంలో ఎంతగా ఉంటుందో తెలియజెప్పే ఘటన ఇది. మితి మీరిన పైత్యం, మితి మీరిన హింస, మితి మీరిన బూతు చూపడం వల్ల అభం శుభం తెలియని పసి హృదయాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. తాజాగా ఒక సినిమాను మూలంగా నిజ జీవితంలో తనువు చాలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటన పూర్తి వివరాలు చదవండి.
ఆదివారం జగిత్యాల పట్టణంలో జరిగిన రెండు మరణాలు సంచలనం రేపాయి. వీరిద్దరి ఆత్మహత్యలకు ఆర్ ఎక్స్ సినిమా మూలం అని జగిత్యాల డిఎస్సీ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ప్రేమ విఫలమైన కారణంగా వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేస్తుండడంతో వారి ప్రేమ విఫలమైంది. దీంతో వారు గత కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నారు. ఇద్దరూ లవ్ ఫెయిల్ అయింది కాబట్టి టాలీవుడ్ లో సంచలనం రేపిన ఆర్ ఎక్స్ 100 సినిమా చూసి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సినిమా వల్ల ప్రభావితులైన వీరిద్దరూ మద్యం సేవించి పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు డిఎస్పీ తెలిపారు.
మరణించిన ఇద్దరు స్టూడెంట్స్ వివరాలివి…
వారిద్దరిదీ ఒకే బడి. ఒకటే తరగతి. ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేశారు. ఈ ప్రేమ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి తుదకు ప్రాణాలు తీసుకుంది. అమ్మాయి ప్రేమ విషయంలో నువ్వు తప్పుకో అంటే నువ్వే తప్పుకో అని ఒకరినొకరు పంతానికి పోయారు. లాస్టుకు ప్రాణాలు కోల్పోయారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీలో నివశిస్తున్న కూసరి మహేందర్, విద్యానగర్ లో నివశిస్తున్న కుందారపు రవితేజ ఇద్దరూ విద్యానగర్ లోన ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులే అయినా ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.
ఆదివారం వీరిద్దరూ మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ లో మద్యం తాగారు. అప్పుడు ఒకరి మీద మరొకరు పెట్రోల్ చల్లుకున్నారు. తాగిన మత్తులో అంటు పెట్టుకున్నారు. దీంతో మహేందర్ అక్కడికక్కడే కాలి ప్రాణాలు కోల్పోయాడు. రవితేజను జగిత్యాల ఆసుపత్రికి అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయినా చికిత్స పొందుతూ మరణించాడు.
వారిద్దరితో కలిసి మందు కొట్టిన స్నేహితుడు వీరు అంటించుకోగానే పారిపోయాడు. దీనిపై విచారణ జరిపి వివరాలు సేకరించిన పోలీసులు ఈ రెండు చావులకు ఆర్ ఎక్స్ 100 సినిమా మూలం అని తేల్చి చెప్పారు. ఈఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ హెచ్చరించారు.
లేత వయసులో ప్రేమ, గీమ అని తిరిగేవాళ్లను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. ఈ విఫల ప్రేమలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడు కూడా పదో తరగతిలో ఉండగానే అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మామ చేతిలో హత్యకు గురయ్యారు. చిన్నతనంలో ప్రేమలు ఇలా నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.