హైదరాబాద్ లో పరువు హత్య

ఓ యువతి కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని ఆమె కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. అల్లుడిని ఇంటికి పిలిపించి పూటుగా మద్యం తాగించారు. అనంతరం పక్కా ప్రణాళికతో అతని తలపై బండరాయితో మోది హత్యచేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో జరిగింది. పూర్తి వివరాలు ఏంటంటే…

సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన అశ్వినిని నందకిశోర్ అనే యువకుడు మూడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరిది కులాంతర వివాహం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు తొలుత పెళ్లికి అంగీకరించలేదు. అయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నందకిశోర్ ను వదిలి వచ్చేయాలనీ, మళ్లీ వివాహం చేస్తామని అశ్వినికి ఆమె తల్లిదండ్రులు ఫోన్ లో చెప్పేవారు. ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 

మెడలో కండువా వేసుకున్న వ్యక్తి నంద కిషోర్

దీంతో బాబును తీసుకుని అశ్విని పుట్టింటికి వచ్చేసింది. పంచాయితీ కోసం రావాలని మాట్లాడుకుందామని నందకిశోర్ ను అశ్విని కుటుంబ సభ్యులు పిలిపించారు. ఈ సందర్భంగా నందకిశోర్ తో శనివారం రాత్రి ఫుల్ గా మద్యం తాగించిన బావమరిది మహేశ్వర్ అతనితో మాట్లాడుతున్నట్టుగా నటించి అతని తలపై బండరాయితో మోది హత్యచేశాడు.

 కాగా ఈ వ్యవహారంలో అశ్విని సోదరుడు మహేశ్వర్ తో పాటు ఇంకొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావాలనే ప్లాన్ ప్రకారం చేశారా లేదా అనుకోకుండా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.