హైదరాబాద్ నడిరోడ్డులో ఇంటర్ అమ్మాయిని నరికిన ప్రేమోన్మాది

హైదరాబాద్ లో మరో ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని ఇంటర్ సెకండియర్ విద్యార్ధిని పై భరత్ అనే యువకుడు కొబ్బరి బోండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

బర్కత్ పురకు చెందిన మధులిక ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడు మధులికను గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే మధులిక అతని ప్రేమకు ఒప్పుకోలేదు. దీంతో భరత్ ప్రేమోన్మాదిగా మారాడు. బుధవారం ఉదయం కాలేజికి వెళ్లేందుకు బస్టాప్ కు వస్తుండగా అక్కడే కాపుకాచి ఉన్న భరత్ కొబ్బరి బోండాల కత్తితో అందరూ చూస్తుండగానే మధులిక పై దాడికి పాల్పడ్డాడు.

 కత్తితో తల,ఛాతీ, కడుపు ప్రాంతాలలో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో మధులిక తీవ్రగాయాలతో రోడ్డుపైనే కొట్టుమిట్టాడింది. అప్రమత్తమైన స్థానికులు భరత్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి మధులికను మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించారు. మధులిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.