ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రేమలో పడటం చాలా సహజం. అయితే ఇలా ప్రేమించుకున్న వారిలో కొన్ని జంటలు మాత్రమే పెళ్లి పీటల వరకు వెళతాయి. మరికొంతమంది మాత్రం మధ్యలోనే వారి ప్రేమను సమాధి చేస్తూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యుల బలవంతం మీద లేదా అమ్మాయిలు వారి భవిష్యత్తు గురించి ఆలోచించి బాగా స్థిరపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తారు. అయితే అమ్మాయిలు ఇలా చేయడంతో కొంతమంది అబ్బాయిలు తాము మోసపోయామని బాధపడితే మరి కొంతమంది మాత్రం అమ్మాయిల మీద కక్ష పెంచుకొని పగ తీర్చుకుంటూ ఉంటారు. తాజాగా హనుమకొండ జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే..హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని కడిపికొండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 26 యేళ్ళ మహిళను ప్రేమించాడు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే, వీరిద్దరిదీ వేర్వేరు మతాలు కావడంతో కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ మహిళ మీద ఉన్న ప్రేమతో ఆ వ్యక్తి తమ పెళ్ళికి మతం అడ్డం రాకూడదని భావించి ఆమె మతాన్ని స్వీకరించాడు. అయినప్పటికీ ఆ యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరి మధ్య కొంతకాలంగా పెళ్లి గురించి గొడవలు జరుగుతూ ఉన్నాయి.
ఇలా పెళ్లి గురించి రోజు తన ప్రియురాలతో గొడవపడే యువకుడు ఇటీవల ఒక రోజు రాత్రి యువతి ఇంటికి వెళ్లి మరొకసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆమెను వేడుకున్నాడు. అయితే తన పెద్దలను కాదని వివాహం చేసుకోలేనని ఆ యువతి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతి గొంతు కోశాడు. ఆ తర్వాత యువతి చేతి పై గాయం చేయటంతో యువతి గట్టిగా అరవగానే ఆ యువతి కుటుంబ సభ్యులు అప్రమత్తమై యువకుడి మీద దాడి చేసి బంధించారు. ఆ తర్వాత యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అవి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు సూచించారు. ఇక ఈ ఘటన గురించి యువతి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.