ఈ ప్రపంచంలో అమ్మతనానికి ఉన్న గొప్పతనం దేనికి ఉండదు. నవ మాసాలు మోసి బిడ్డని కన్న తల్లి తన తుది శ్వాస విడిచే వరకు ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అయితే కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఒక తల్లి మానవత్వం మరిచిపోయి గొంతు నలిమి చంపిన ఘటన సంచలనంగా మారింది. అమ్మతనానికి మచ్చ తెచ్చే ఈ ఘటన స్థానికంగా చర్చాంషనీయంగా మారింది. అయితే ఆ తల్లి కన్న కూతుర్ని గొంతు నలిమి చంపటానికి గల కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
వివరాలలోకి వెళితే…అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని చెన్నారెడ్డి వీధికి చెందిన షేక్ మహమ్మద్ బాషా అనే వ్యక్తి సంబేపల్లే మండలం చౌటపల్లె గ్రామమానికి చెందిన షేక్ ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి రుక్సానా అనే పదినెలల కుమార్తె ఉంది. అయితే ఫాతిమాకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు వింతగా ప్రవర్తించేది. కొన్ని సందర్భాలలో భర్తకు చెప్పకుండా పుట్టింటికి కూడా వెళ్లిపోయేది. ఆమె మతిస్థిమితం సరిగా లేకపోవడమే కాకుండా ఆమెకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే తన పరిస్థితి గురించి తెలుసుకున్న ఫాతిమా తొందర్లోనే తాను చనిపోతానని భావించింది. అయితే తాను చనిపోతే తన కూతురు ఒంటరిగా మిగిలిపోతుందని ఎవరు ఆమెను సరిగా చూసుకోరని భయపడింది.
తాను చనిపోతానన్న భయంతో కూతురి మీద ఉన్న ప్రేమతో తన కూతురు కష్టాలు పడకూడదని భావించి ఫాతిమా ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో శనివారం తన కూతురిని తీసుకొని రాయచోటికి వచ్చింది. అక్కడ నుంచి పెమ్మాడపల్లె అనే గ్రామ సమీపంలో ఉన్న గుట్టలోకి తీసుకెళ్లి గొంతు నులిమి తన బిడ్డను చంపేసింది. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని భుజం మీద వేసుకొని పీలేరుకు తిరిగి వెళ్లి.. అక్కడినుండి తన భర్తకు ఫోన్ చేసి కూతురుని చంపిన విషయం వెల్లడించింది. దీంతో కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన అక్కడికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పాపను హత్య చేసిందా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.