దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఆ నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకొని నిరుద్యోగులను నట్టేట ముంచే విధంగా కొంత మంది తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెన్సీలు పెట్టి చెప్పే పని ఒకటి తీర వారు తీసుకెళ్లేది ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలోకి. చదువు రాని వారు చేసే లేబర్ పనిని డిగ్రీలు చదువుకున్న వారికి చూపిస్తున్నారు. దీంతో నిరుద్యోగులు తాము మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఏజెన్సీ చేసిన మోసంతో వందలాది మంది రోడ్డున పడ్డారు.
ప్రముఖ బిస్కట్, చాక్లెట్ కంపెనీలలో ఉద్యోగాలిస్తామని ఆకర్షణీయమైన వేతనమని ఆశ చూపి వేరే పని చూపించి మోసం చేశారని పలువురు బాధితులు తెలిపారు. నాగోల్ లొని ఎస్. ఎస్ సోల్యూషన్స్ ఏజన్సీ ఉద్యోగాలిప్పిస్తామని ప్రకటనలు ఇస్తుంది. ప్రముఖ కంపెనీలలో మంచి జీతం మంచి ఉద్యోగమని నిరుద్యోగులను నమ్మిస్తారు. వీరు ఇచ్చిన ప్రకటనలు చూసిన నిరుద్యోగులు ఆశతో వీరిని సంప్రదిస్తారు.
నిరుద్యోగులు ఏజెన్సీని కలిసిన తర్వాత ముందుగానే వారి నుంచి ఫీజు రూపంలో 1000 రూపాయల నుంచి 1500 వందల రూపాయలు వసూలు చేస్తారు. వారికి అప్లికేషన్ ఫాం ఇచ్చి వివరాలు అన్ని ఫిల్ చేస్తారు. వారిని ఏదో తూతూ మంత్రంగా ఇంటర్వ్యూ చేసి జాబ్ కి సెలక్ట్ అయ్యావని చెప్పి కంపెనీ వద్దకు తీసుకెళతారు. తీరా వారు తీసుకెళ్లేది ఫార్మా కంపెనీకి. బిస్కట్ కంపెనీ అని చెప్పి కెమికల్ కంపెనీకి తీసుకొచ్చావు అని అడిగితే ఇదే ఉంది చేస్తే చెయ్యి లేకపోతే లేదు అని వారు బెదిరిస్తారట. కట్టిన డబ్బులు ఇవ్వమంటే ఇవ్వం ఏం చేసుకుంటావో చేసుకొపో అని బెదిరిస్తారని మోసపోయిన వారు చెబుతున్నారు.
ఏజన్సీ సంస్థలు ముందుగానే కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని నియమాకాలు చేస్తాయి. వారికి మనుషులను పంపించినందుకు కొంత కమిషన్ తీసుకుంటారు. ఏజన్సీలు రిక్రూట్ చేసుకున్న వారిని ఆయా కంపెనీల లేబర్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. వారు ఎంపికైన వారికి కంపెనీలో పని చూయించి వారి మీద కూడా కమిషన్లు తీసుకుంటారు. పని చేసే వారికి కంపెనీ రోజుకు 400 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కమిషన్ తీసుకొని 300 రూపాయలు మాత్రమే వారికి చెల్లిస్తారు. మరికొంత మందికి రూం, ఫుడ్ పైసలు కట్ చేసుకొని నెల పేరు మీద 6000 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తారని బాధితులు చెప్పారు.
కొంత మంది బాధితులకు చాక్లెట్ కంపెనీలో జాబ్ అని చెప్పి లియో ఫార్మా కంపెనీలో జాబ్ చూపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇదే ఉంది చేస్తే చెయ్యి లేకపోతే లేదు అన్నారట. ఇలా నచ్చక ఈ నెల రోజుల కాలంలోనే దాదాపు 100 మంది వెళ్లిపోయారట. ఇలా 100 మంది దగ్గర తీసుకున్న 1000 రూపాయలు ఏజెన్సీ వద్దే ఉన్నాయి. అంటే లక్ష రూపాయలు అన్నమాట. ఇలా అనేక ఏజెన్సీ సంస్థలు కోట్ల రూపాయలల్లో దండుకొని నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసు వారు ఇటువంటి ఏజెన్సీ సంస్థల పై దృష్టి పెట్టి మరికొంత మంది మోసపోకుండా కాపాడాలని వారు కోరుకుంటున్నారు. ఇలా మోసం చేస్తున్న ఏజెన్సీల పై కఠిన చర్యలు తీసుకోవాలని మోసం చేస్తున్న కంపెనీలను సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
లీ కంపెనీ ఫార్మాలో ఉద్యోగానికి వచ్చి మోసపోయిన వారు “తెలుగు రాజ్యం” తో మాట్లాడారు. వారు ఏమన్నారంటే
నాకు బిస్కట్ కంపెనీలో ఉద్యోగమని చెప్పి రిక్రూట్ చేసుకున్నారు. కానీ లీ ఫార్మా కంపెనీలో లేబర్ చేసే పనిని చూయించారు. ఇదేంటని కంపెనీ వారిని అడిగితే నువ్వు వచ్చింది ఈ పనికే చేస్తే చెయ్యి లేకపోతే లేదు అని హెచ్చరించారు. ఏజన్సీ ని అడిగితే అదే జాబ్ ఉందన్నారు. నేను కట్టిన పైసలు అడిగితే రావని చెప్పారు.
– దాము, విజయనగరం
నాకు చాక్లెట్ కంపెనీలో అని చెప్పి ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలో జాబ్ ఇచ్చారు. ఆ వాసనను భరించలేక నేను బయటికెళ్లాను. నేను కట్టిన పైసలు కూడా పోయాయి. అనేక మందిని వీరు మోసం చేస్తున్నారు. మరికొంత మంది మోసపోకముందే ప్రభుత్వం స్పందించాలి.
-రాకేష్, సిద్దిపేట
నన్ను కూడా మంచి ఉద్యోగమని చెప్పి తీసుకొచ్చారు. పైసలు కట్టించుకొని ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ ఇచ్చారు. కానీ తీసుకెళ్లి ఫార్మా కంపెనీలో ఉద్యోగమిచ్చారు. అది కూడా నాకు సంబంధం లేని పని. ఇలా అనేక మందిని మోసం చేస్తున్నారు. లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. లేబర్ కాంట్రాక్టర్లు, ఏజన్సీలు కమీషన్ల కోసం కక్కుర్తి పడి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అటువంటి వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలి.
-
నాగరాజు, నల్లగొండ