Cyber Crime: భారీ సైబర్ క్రైమ్..! 2.50కోట్లు దోచేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్..!

Cyber Crime: సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయం ఎంత ప్రమాదమో తెలిపే సంఘటన రాజస్థాన్ లో జరిగింది. చాటింగ్ తో పరిచయమై.. నమ్మకం పెంచి.. స్నేహితురాలినని నమ్మించి.. ఏకంగా 2.50 కోట్లు దోచేసింది. 2017లో జరిగిన ఈ మోసానికి సంబంధించిన కేసులో కీలక నిందితుడ్ని ఈ ఆదివారం.. జూన్ 20న పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్ రాష్ట్రంలోని సామై మాధోపూర్ నగరానికి చెందిన ఓ యువతి ఫేస్ బుక్ మెసెంజర్ లో ఉంది. ఆమెకు రెబెకా క్రిష్టినా అనే విదేశీ మహిళ పరిచయమై.. మాటలు కలిపింది. స్నేహితురాలిగా నమ్మించింది. తన బాధలు చెప్పుకుంది. తాను ఒంటరినని.. ఈ మధ్యనే భర్త చనిపోయాడని చెప్పింది. పైగా.. తనకు కేన్సర్ వచ్చిందని డాక్టర్లు నిన్నే చెప్పారని తన బాధ చెప్పుకుంది. ఆరు నెలలకు మించి బతకనని డాక్టర్లు చెప్పినట్టు చెప్పి నమ్మించింది.

నా బాధ నీతో చెప్పుకుంటుంటే మనశ్శాంతిగా ఉందనీ.. దేవుడిచ్చిన చెల్లిలా అనిపిస్తున్నావని చెప్పుకొచ్చింది తనకున్న 3.9 మిలియన్ డాలర్లు (దాదాపు 29 కోట్ల రూపాయలు) ఆస్తిని రాసిచ్చేస్తానని చెప్పింది. ఇవన్నీ నిజమేనని నమ్మిందా యువతి. కొన్ని రోజుల తర్వాత ఆస్తి నీ పేరు మీదకు మార్చేశానని రెబెకా చెప్పింది. తన లాయర్, ఆదాయపన్ను అధికారులు ఫోన్ చేస్తారనీ, అడిగిన వివరాలు ఇవ్వాలని చెప్పింది. నగదును భారత్‌ కరెన్సీలోకి మార్చిస్తారని చెప్పింది. ఇద్దరు వ్యక్తులు యువతికి ఫోన్ చేశారు. ప్రోపర్టీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఫారిన్ ఎక్ఛేంజ్ ట్యాక్స్, బ్యాంక్ డిటైల్స్ ఈమెయిల్ కు పంపించారు.

ఆస్తి బదలాయించాలంటే కొంత నగదు టాక్సుల రూపంలో కట్టాలంటే ఏకంగా 2.5 కోట్లు 55 బ్యాంక్ అకౌంట్లలో బదిలీ చేయించుకున్నారు. నగదు ఇవ్వకపోగా.. ఇంకా అడుగుతూండటంతో తాను తాను మోసపోయినట్టు గ్రహించింది. దీంతో జైపూర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి నాలుగేళ్ల తర్వాత ఉత్తరాఖండ్ లోని ముస్సోరీకి చెందిన నీరజ్ సూరి, కొందరు నైజీరియన్లు పాత్రధారులుగా తేలింది. జూన్ 20న నీరజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతికి న్యాయం చేస్తామని అంటున్నారు.