మైనింగ్ మాఫియాను అడ్డుకోపోయిన డీఎస్పీ.. ట్రక్కుతో గుద్ది చంపిన డ్రైవర్?

హర్యానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా మైనింగ్ మాఫియా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోబోయారు. అయితే మైనింగ్ మాఫియాను అడ్డుకోవడానికి వెళ్లిన డీఎస్పీపై ఏకంగా ట్రక్కు ఎక్కించి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఇలా ఒక పోలీస్ అధికారి పట్ల జరిగిన దాడిపై నిరసనలు వ్యక్తం చేయడమే కాకుండా నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ఉన్న నుహ్ పచ్‌గావ్ పరిధిలో జులై 19 వ తేదీ గనుల్లో అక్రమంగా రాయిని తరలిస్తున్నారని సమాచారం అందడంతో మెవాట్ డీఎస్పీ సురేంద్ర సింఘ్ బిష్ణోయ్‌ సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలను ఆపాలని సూచించారు. ఈ క్రమంలోనే ఇద్దరు పోలీసులు ట్రక్ ఆపడం కోసం ఎదురుగా నిలబడి ఉండగా ట్రక్కు దూసుకు రావడంతో పోలీసులు పక్కకు తప్పుకున్నారు. అయితే డీఎస్పీ సురేంద్ర సింఘ్ బిష్ణోయ్‌ లారీ ఎదురుగా నిలబడి దానిని ఆపాలనే ప్రయత్నం చేశారు.

ఈ విధంగా ట్రక్ ఆపడం కోసం డిఎస్పి ప్రయత్నాలు చేసినప్పటికీ ట్రక్ డ్రైవర్ ఏకంగా తనని గుద్ది ముందుకు వెళ్లడంతో తీవ్ర గాయాల పాలైన డిఎస్పి సురేంద్ర సింఘ్ బిష్ణోయ్‌ అక్కడికక్కడే మృతి చెందారు.ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టడమే కాకుండా అతనికి కఠిన శిక్ష పడే వరకు పోరాడుతామని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.