చిత్తూరులో డాక్టరమ్మ ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం జరిగింది. జూనియర్ డాక్టర్ శిల్ప ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప ఐదేళ్ల క్రితం రూపేష్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. శిల్ప ప్రస్తుతం ఎస్వీ మెడికల్ కళాశాలలో పిడియాట్రిక్ డిపార్ట్ మెంటులో పీజీ చదువుతున్నది. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ శిల్ప గత ఏప్రిల్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటి అధికారులకు, గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.

శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సాయంత్రం పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. శిల్ప గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో అధ్యాపకులు కావాలనే ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని శిల్ప  బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.