భూపాలపల్లి జిల్లాలో దారుణం… మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన అల్లుడు.. కారణం అదేనా?

ప్రస్తుత కాలంలో డబ్బుకి ఉన్న విలువ బంధాలకు బంధుత్వాలకు లేకుండా పోయింది. కొంతమంది డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను, తొడ పుట్టిన వారు, స్నేహితులు అని కూడా కనికరం చూపించకుండా వారిని చంపటానికి వెనకాడటం లేదు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా, గుణపురం మండలం, వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన అల్లుడు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రెండవ భార్య కొడుక్కి తన ఉద్యోగం ఇప్పించాలని ఆలోచనలో ఉన్న వ్యక్తిని కూతురి భర్త కిరాతకంగా ట్రాక్టర్ తో గుద్ది హత్య చేశాడు.

వివరాలలోకి వెళితే.. భూపాలపల్లి జిల్లా, గుణపురం మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన బండారి ఓదెలు అనే వ్యక్తి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నలుగురు కుమార్తెలు కాగా రెండవ భార్యకు ఒక కుమారుడు ఒక కుమార్తె. అయితే కుమారుడి భవిష్యత్తు కోసం ఓదెలు తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి తన ఉద్యోగాన్ని కొడుకుకు ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నాడు. అదే గ్రామంలో నివాసం ఉంటున్న పెద్దభార్య రెండో కుమార్తె, ఆమె భర్త నక్క రమేష్ కి ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ తన మామ మీద కోపంతో రగిలిపోయాడు. దీంతో ఎలాగైనా తన మామను మట్టుపెట్టాలని భావించాడు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వస్తున్న తన మామాను గమనించిన రమేష్ గుండ్లవాగు వద్దకు రాగనే ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేశాడు. తన మామని హత్య చేసిన తర్వాత రమేష్ నేరుగా గణపురం పోలీస్ స్టేషన్‌కు తాను హత్య చేసిన విషయాన్ని పోలీసులకు వివరించి లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మామ ఉద్యోగం వస్తే బావమరిది బాగుపడతాడని భావించిన రమేష్ ఎలాగైనా ఆ ఉద్యోగం తనకి దక్కకుండా చేయడానికి తన మామను హత్య చేసినట్లు స్థానికులు వెల్లడించారు.