శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు?

ప్రస్తుత కాలంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు డబ్బు సంపాదనలో పడి ప్రజలు బంధాలు, భందుత్వాలను మరచిపోతున్నారు. ముఖ్యంగా నవమాసాలు మోసి కని పెంచిన తల్లి తండ్రులు కూడా భారమైపోతున్నారు. వయసు మీద పడిన తల్లిదండ్రులను పోషించడానికి కూడా వారి పిల్లలకు బారమైపోతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే వారికి చేతకాని సమయంలో కనీసం మూడు పూటలా తిండి కూడా పెట్టకుండా వారిని భాదిస్తున్నారు. అందువల్ల వయసైపోయిన తల్లిదండ్రులను అనాధలుగా వదిలేస్తున్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. పైసలు మీద పడిన తల్లిదండ్రులను కడుపున పుట్టిన వారు చూసుకోకపోవటంతో మనస్థాపనతో వృద్ధ దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వివరాలలోకి వెళితే.. శ్రీ సత్య సాయి జిల్లా, గోరంట్ల మండలం వానవోలు గ్రామానికి చెందిన పాపన్న (65), వెంటలక్ష్మమ్మ (61) దంపతులు వ్యవసాయంతో పాటు గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారందరినీ ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కుమారుడు స్వగ్రామంలో నివాసం ఉండగా..చిన్న కుమారుడు బ్రతుకు తెరువు కోసం బెంగుళూరు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. ఇంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు కృష్ణా రామ అంటూ మనవళ్ళతో ఆడుకునే వయసులో వీరికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.

నాలుగేళ్ల క్రితం పాపన్న కంటి చూపు మందగించి పూర్తిగా చూపుకోల్పోయాడు. వయసు పెరగటంతో వెంకటలక్ష్మమమ్మకి కూడా ఇటీవల కంటి చూపు మందగించింది. పెద్దకుమారుడు సొంతూరులో ఉన్నా కూడా తల్లి తండ్రులను పట్టించుకునేవాడు కాదు. ఈ కష్ట పరిస్థితుల్లో కడుపున పుట్టిన పిల్లలు వారిని పట్టించుకోకపోవడంతో ఈ దంపతులిద్దరూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేక గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. ఈ దంపతుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.