రాష్ట్రంలో లింగత్వ పరీక్షలకు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. లింగత్వ నిరోదక చట్టం అమలుకు నోచుకోవడం లేదు. లింగత్వ పరీక్షలను కఠినంగా పరిగణిస్తున్న మన ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అమల్లో సాధ్యం కావడం లేదు. గర్భంలోనే శిశువు సమాధి చేసేందుకు తల్లిదండ్రులు, డాక్టర్లు వెనకాడడం లేదు. స్కానింగ్ కేంద్రాల ముసుగులో లింగత్వ పరీక్షలు చేస్తున్నారు. ఆడ శిశువు అని తేలితే డాక్టర్లు అబార్షన్లకు తెగబడుతున్నారు. వైద్యం వికటించి రోడ్డేక్కితే తప్ప ఇలాంటి కేసులు బయటకు రావడం లేదు. లింగత్వ పరీక్షలను చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ, నగర ప్రాంతాల్లో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతిక పరిజ్ణానం ముసుగులో కడుపులోని బిడ్డను గుర్తించేందుకు తల్లిదండ్రులు తహతహ లాడుతున్నట్లు సమాచారం. దీని కోసం స్కానింగ్ కేంద్రాలకు ఎన్ని డబ్బులైనా ఇచ్చేందుకు తల్లిదండ్రులు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. ఇదే అదనుగా భావిస్తున్న డాక్టర్లు విచ్చల విడిగా స్కానింగ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల తదితర పట్టణాల్లో పుట్టగొడుగుల్లా స్కానింగ్ కేంద్రాలు నడుస్తున్నట్లు తెలిసింది. మెటర్నిటీ ఆసుపత్రుల ముసుగులో స్కానింగ్ కేంద్రాలను నడిపిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యథేచ్ఛగా స్కానింగ్ కేంద్రాలను డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సుమారు 2000 స్కానింగ్ కేంద్రాలు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఫర్టిలిటీ సెంటర్లు కూడా విచ్చల విడిగా వెలుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో ప్రధానంగా డబ్బులు వసూలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఒక్క కేసుకే సుమారు 6లక్షల నుంచి 10లక్షల వరకూ ఫర్టిలిటీ కేంద్రాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఫర్టిలిటీ కేంద్రాల ముసుగులోనూ లింగ నిర్ధారణ పరీక్షలను చేస్తున్నట్లు సమాచారం. గర్భిణీ స్త్రీలు తమ కడుపులో ఉన్న పిండం ఆడ, మగ అని తెలుసుకునేందుకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ స్కానింగ్ కేంద్రాలకు లైసెన్స్ లు కూడా లేకుండా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్కానింగ్ కేంద్రాలను రాజకీయ నాయకుల బంధువులే ఎక్కువగా నిర్వ హిస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, బషీర్ బాగ్, సోమాజీగూడ, వెస్ట్ మారేడు పల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, పంజాగుట్ట, ఎర్రమంజిల్ కాలనీ, అబిడ్స్, కోఠి, దిల్ సుక్ నగర్, మలక్ పేట, ఎల్బీనగర్, సరూర్ నగర్, చార్మినార్, లాల్ దర్వాజ, బహదూర్ పూార, తదితర ప్రాంతాల్లో స్కానింగ్ కేంద్రాలు విచ్చల విడిగా ఉన్నట్లు తెలిసింది. ఈ కేంద్రాల్లో చాలా వరకూ లైసెన్స్ లు కూడా లేకుండా అనధికారికంగా నడుస్తున్నాయి. వీటిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. పైగా ఏదైనా కేసులు అయినప్పుడే అధికారులు స్పందిస్తున్నారని సమాచారం.