విద్య, బుద్ధి నేర్పించే ఉపాధ్యాయులే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అరాచకాలకు పాల్పడుతున్నారు. చదువు కోసం బడికే పంపే పిల్లలు తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా తల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అర్ధం కాని పరిస్థితులు ఈ సమాజంలో ఏర్పడ్డాయి. తల్లితండ్రి, గురువు దైవంతో సమానమంటారు మన పెద్దలు అలాంటి గురువులే మృగాళ్ళుగా మారి ఘోరమైన అరాచకాలకు పాల్పడుతుంటే పసికందులు బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక ఏం చెయ్యాలో తోచక ఇబ్బంది పడే విద్యార్ధులు ఎక్కువయిపోయాఇరు.
ఇటీవలె ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తమ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ… విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇంతటి రాక్షస ప్రధానోపాధ్యాయుడు మాకొద్దంటూ నినాదాలు మొలుపెట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి నగర పరిధి సత్యనారాయణపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సోమవారం ఉదయం విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రవీంద్రయ్య పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థినులతో హెడ్మాస్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలో తనతో పాటే పనిచేసే ఉపాధ్యాయురాలుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
అయితే నిజనిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయవద్దని, తనపై కోపంతో కొందరు ఉపాధ్యాయలు, విద్యార్థులు కలిసి ఇలా కుట్ర పన్నారని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయన పై దాడికి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను రక్షించారు. ఇంతకీ అసలు నిజ నిజాలే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దీని పై దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే సమాజంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. దీని పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుని పోలీసులు వీటి పై తగిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటే బావుంటుంది. అలాగే పాఠశాలకు వెళ్ళే విద్యార్ధినులు కూడా ఎంతో నేర్పరితో ఇలాంటివి జరిగిన వెంటనే భయపడకుండా సంబంధించిన వ్యక్తులకు ఫిర్యాదు చెయ్యడంతో వాళ్ళ అరాచకాలకు కళ్ళెం పడుతుంది లేని ఎడల అవి ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి.