దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు ఈ రోజు తెరపడింది. ఎన్‌కౌంటర్ లో నిందులను పోలీసులు హతమార్చారు. ఈ ఘటన పై యావత్ ప్రపంచమంతా పోలీసులను మెచ్చుకుంటుంది. ఇక ఇదే ఘటన పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆయన స్పందనను ఈ విధంగా వ్యక్తపరిచారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డమ్మీ హోం మినిస్టర్, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి పనిచేయకపోయినా, పోలీసులు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని కొనియాడారు. నిందితులు తప్పించుకునే క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని సీపీ సజ్జనార్ చెబుతోన్న కారణాలను విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిందితులైన మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో వెంటనే చనిపోయారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులకు కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. గురువారం అర్థరాత్రి దాటాక జైలు నుంచి వీరిని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.
నేరం జరిగిన చోట పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని తొండుపల్లి టోల్‌గేట్ దగ్గరకు గురువారం అర్ధరాత్రి తీసుకెళ్లారు. అక్కడి నుంచి దిశను పెట్రోల్ పోసి కాల్చిన చటాన్‌పల్లి స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. నిందితులు రాళ్లు రువ్వినందునే పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ధ్రువీకరించారు.
మృగాళ్లకు పోలీసులు సరైన శిక్ష విధించారంటూ ఎన్‌కౌంటర్‌పై అన్నివర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మృతుల కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలను పోలీసులు అన్యాయంగా చంపేశారని ఆరోపిస్తున్నారు. తన భర్తను పోలీసులు అన్యాయంగా చంపేశారని నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. విశరనై అనే ఓ తమిళ హారర్ థ్రిల్లర్ గుర్తువస్తుందని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వినపడుతున్నాయి. కొంత మంది ఈ సంఘటన పై హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు.