తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయగా ఆ మార్గదర్శకాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రేషన్ కార్డు ప్రమాణికంగా ముందుగా స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తున్నట్టు తెలంగాణ సర్కార్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
రేషన్ కార్డ్ లేనివాళ్లకు మాత్రం ఆధార్ ప్రామాణికంగా రుణమాఫీ జరగనుంది. అర్హత ఉన్న రైతుల ఖాతాలలో ఈ మొత్తం జమ కానుంది. లక్ష లోపు రుణం తీసుకున్న అన్నదాతల అకౌంట్లో గురువారం సాయంత్రంలోపు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతులు రుణాలు పొందారని సమాచారం అందుతోంది.
రుణాలు పొందిన రైతులలో 6.36 లక్షల మందికి రేషన్‌కార్డులు లేవని తెలుస్తోంది. రైతులకు అన్యాయం జరగనివ్వనని చెప్పిన రేవంత్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమయ్యే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన విధించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కొసమెరుపు.
రేపు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించనుండగా రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని సమాచారం అందుతోంది. నగదు జమైన రైతులతో కలిసి రుణమాఫీ సంబరాలు జరపాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది.