‘ద లయన్‌ కింగ్’ తెలుగు వెర్షన్ కలెక్షన్స్

‘ద లయన్‌ కింగ్’తెలుగు వెర్షన్ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

‘సూర్య కిరణాలు పడే ప్రతి చోటూ మన రాజ్యమే!. కానీ, ఒక రాజు పరిపాలన సూర్యుడిలా ఉదయించి, అస్తమిస్తుంది. ఒకరోజు నా పాలనలో అస్తమించిన సూర్యుడు.. కొత్త రాజైన నీ పాలనలో ఉదయిస్తాడు’ అంటూ మన ముందుకు మరోసారి వచ్చేసింది లయిన్ కింగ్. పేరుకు డబ్బింగ్ సినిమా అయినా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా భాక్సాఫీస్ ని శాసిస్తూ ముందుకు దుసుకుపోతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ జంతువుల సినిమా కోసం థియోటర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. ఈ స్దాయి రెస్పాన్స్ వాళ్లూ ఊహించి ఉండరు.

ఇక మనదేశం అంతటా అన్ని లాంగ్వేజ్ లలో ఇదే పరిస్దితి నెలకొని ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 65 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అవేంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్, అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ త‌ర్వాత ఇండియాలో అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన హాలీవుడ్ సినిమా ఇదే కావ‌డం విశేషం. తెలుగులో కూడా ల‌య‌న్ కింగ్ వ‌సూళ్లు భారీగానే ఉండటంతో మరిన్ని సినిమాలు తెలుగులోకి రావటానికి దారి ఏర్పడినట్లైంది. భాష‌తో ప‌ని లేకుండా అన్ని ప్రాంతాల్లో ల్లో కూడా దుమ్ము దులిపేస్తుంది ల‌య‌న్ కింగ్.

ఇక ఈ సినిమాకు ఫ్యామిలీస్ తరలి వెళ్లటం కలిసి వస్తోంది. పిల్ల‌ల‌తో పాటు వ‌చ్చి పెద్దలు 3డి ల‌య‌న్ కింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో క‌లెక్ష‌న్స్ హ‌వా క‌నిపిస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నా కూడా దాన్ని త‌ట్టుకుని భారీ వ‌సూళ్లు రాబ‌డుతుంది ల‌య‌న్ కింగ్. హైద‌ర‌బాద్ స‌హా మిగిలిన ఏరియాల్లో కూడా ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగేస్తుంది.

1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం… ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. అలాగే నేటివిటి కోసం ఈ చిత్రానికి ఆయా భాషల్లో టాప్ హీరోలు, కమెడియన్‌లు వాయిస్‌ ఇవ్వడం విశేషం.

ఇక తెలుగు వెర్షన్ కు వస్తే…ప్రధాన పాత్ర సింబా అనే సింహానికి నాని, సింబా తండ్రి ముఫాసాకు రవి శంకర్‌, స్కార్‌కు జగపతిబాబు గళం అందించగా, టిమోన్‌ అనే ముంగిస అలీ, పుంబా అనే అడవి పందికి బ్రహ్మానందం డబ్బింగ్‌ చెప్పారు.
 
ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్‌లుగా సక్సెస్‌ అయిన సిండ్రెల్లా, ద జంగల్‌ బుక్‌, బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్‌ కింగ్‌ కూడా విజయం సాధించింది.