నాగశౌర్య,అవసరాల కొత్త చిత్రంకు వెరైటీ టైటిల్

నాగశౌర్యను హీరోగా సక్సెస్ ని  అందించిన మొదట దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ఊహలు గుసగుసలాడే సినిమా హిట్ అవ్వటంతో హీరో నాగశౌర్యకు, డైరెక్టర్‌ అవసరాల శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు లభించింది. తరువాత నాగశౌర్య హీరోగా దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి సినిమాలతో విజయం అందుకున్నారు.
 
అవసరాల డైరక్టర్ గా తన రెండో చిత్రం  జో అచ్యుతానంద సినిమాను డైరెక్ట్‌ చేసి  నాగశౌర్యకు మరో హిట్‌ను ఇచ్చారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. ఫారిన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుక అవసరాల శ్రీనివాస్‌ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు..‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’అనే టైటిల్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. 
 
మాళవిక నాయక్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని  పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ పతాకంపై విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తి కాగా, మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఇతర నటీనటులు.. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.