చైతు ‘మజిలీ’:స్టోరీ, టాక్, హైలెట్స్

అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. క్రికెట్, ప్రేమ, పెళ్లి ఈ విషయాలు చుట్టూ సాగే రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కథ , హైలెట్స్ చూద్దాం.

పూర్ణ(నాగచైతన్య)కి క్రికెట్ అంటే పిచ్చి. తండ్రి (రావు రమేష్) కెరీర్ ని డిసైడ్ చేసుకోమని ఓ సంవత్సరం డెడ్ లైన్ పెడతాడు. అతను ఆ పనిలో ఉండగా అన్షు (దివ్యాన్ష కౌశిక్)పరిచయం అవుతుంది. స్ట్రిక్ట్ గా ఉండే నేవీ ఆఫీసర్ (అతుల్ కులకర్ణి) కుమార్తె ఆమెతో మొదట స్నేహంగా మొదలై ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. అయితే విలన్ గా సుబ్బరాజు అనే యూత్ లీడర్ వీళ్ల లవ్ స్టోరీలోకి ప్రవేసించి చెడగొడతాడు. అప్పుడు ఈ ప్రేమ జంట పారిపోయి…తాజ్ హోటల్ లో దాక్కుంటుంది. ఓ ప్రక్క సుబ్బరాజు గ్యాంగ్ , మరో ప్రక్క ఆమె పేరెంట్స్ వీళ్ల కోసం వెతుకుతూంటారు. ఆ క్రమంలో అన్షు…అక్కడే రూమ్ లో వెయిట్ చేయమని తాను బయిటకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుని వస్తానంటుంది. అయితే ఆమె తిరిగిరాదు. పూర్ణ జీవితంలోకి శర్వాణి(సమంత) ప్రవేశిస్తుంది. శర్వాణి ఎవరు…అన్షు ఏమైంది, పూర్ణ తన టార్గెట్ అయిన క్రికెటర్ గా కాగలిగాడా వంటి విషయాలతో సెకండాఫ్ రన్ అవుతుంది.

ఇక ఈ సినిమా చూసిన వాళ్లు సమంత, నాగ చైతన్యలు పాత్రల్లో జీవించారని.. భావోద్వేగ కథను చాలా సున్నితంగా మనసులకు హద్దుకునేలా శివ నిర్వాణ అద్భుతంగా తీశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా అక్కినేని నాగార్జునతో మరికొందరు ఈ చిత్రంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. నాగచైతన్యకు చాలా కాలానికి మంచి హిట్ పడిందని అంటున్నారు.

థ‌మ‌న్ రీరికార్డింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.ఇక క్లైమాక్స్ చూసిన తరవాత ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బరువెక్కిన గుండెలతో బయటికి వస్తారని చెప్తున్నారు. ఇక ఆల్రెడీ పెళ్లైన మగాళ్లు అయితే తమ భార్యల గురించే ఆలోచిస్తూ థియేటర్ నుంచి బయటికి వస్తారని చెప్తున్నారు. .

ఈ సినిమాకు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన సంగీతం సినిమాకు ఎమోషనల్ కనెక్టివిటిని సెట్ చేస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.