సినిమా ప్రమోషన్ కు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అనుసరించే వ్యూహాలు కొత్తగా ఉంటాయి. తాజాగా ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన భారీ విజువల్ వండర్ ‘2.0’ రైట్స్ తీసుకుని విడుదల చేసారు. 3డి, 2డి ఫార్మాట్‌లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నవంబర్ 29న గ్రాండ్‌గా విడుదలైంది. తన చిత్రం ప్రమోషన్ కు ఆయన పిల్లలను ఆకట్టుకునేలా ఓ కొత్త మార్గం ఎంచుకోబోతున్నట్లు సమాచారం.
‘2.0’ సినిమాని పిల్లలకు దగ్గర చేస్తే ..వాళ్లతో పాటు పెద్దలు కూడా వస్తారనే స్ట్రాటజీని ఆయన నమ్ముకోబోతున్నారు. అందుకోసం ఆయన సెలబ్రెటీల పిల్లల అందరికీ స్పెషల్ షో చూపించి , వాళ్ల బైట్స్ ని మీడియాకు ఇచ్చి పబ్లిసిటి చెయ్యాలనుకుంటున్నారు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ మొదలు రవితేజ పిల్లలు, వెంకటేష్ పిల్లలు,అల్లు అర్జున్ పిల్లలు ఇలా వరసపెట్టి అందరినీ ఆహ్వానించి..సినిమా చూపించనున్నారు. వాళ్లతోపాటు వాళ్ల తల్లులు రావచ్చు. హీరోలు వస్తే ఇంకా హ్యాపీ. ఇలా పిల్లల సినిమా అని ఈ సినిమాని ప్రమోట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
దిల్ రాజు మాట్లాడుతూ..‘‘ మహేష్‌బాబు 2డీలో చూశారట. ఆయన నాతో మాట్లాడుతూ ‘అద్భుతంగా ఉంది. త్రీడీ చూడాలనుందని గౌతమ్ అన్నాడు’న్నారు. అలా పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి చూస్తున్న సినిమా ఇది.
భారతీయ సినిమాని హాలీవుడ్ స్థాయిలో చూపించాలనే తపనతో చిత్రాల్ని రూపొందిస్తుంటారు దర్శకుడు శంకర్. ‘2.ఓ’తో మన సినిమా మరో మెట్టు అధిగమించేలా చేశారు. ఒక దృశ్యకావ్యంలా ‘2.ఓ’ని శంకర్ ఆవిష్కరించారు. చిత్రానికి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇందుకు నిదర్శనం వసూళ్లే. ఇది ఇలా సంక్రాంతి వరకూ ఆడే సినిమా. నేను మూడుసార్లు చూశా. త్రీడీలో అద్భుతం అనిపిస్తే, 2డీలోనూ విభిన్నంగా ఉందనిపించింది.
ఇలాంటి సినిమాల్ని పైరసీలో చూస్తే ఏమాత్రం అనుభూతిని పొందలేరు. శంకర్ గత సినిమాలన్నీ ఒకెత్తయితే… ఈ సినిమా ఒకెత్తు. చివరి 20 నిమిషాలు రజనీకాంత్ చేత శంకర్ చేయించిన మాయాజాలం వల్ల ప్రేక్షకులు ముగ్ధులవుతున్నారు’’ని చెప్పారు.