‘పేట’ కలెక్షన్స్.. దిల్ రాజుతో గొడవ దెబ్బ కొట్టిందా?

తెలుగులో ధియోటర్స్ నుంచి ఎన్ని సమస్యలు ఎదురైనా… గెలుస్తామనే నమ్మకంతో ఈ సంక్రాంతికి రజనీకాంత్ త‌న‌దైన స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ పెట్టుబడిగా పేట‌గా మన ముందుకు వ‌చ్చారు. అయితే మార్నింగ్ షోకే అంత సీన్ లేదని తేలిపోయింది. పాత సినిమాలన్ని కలిపేసి కొత్త కలరింగ్ ఇచ్చి వదిలారని అర్దమైపోయింది. రీసెంట్ గా 2.0తో అల‌రించిన ర‌జ‌నీ కొత్త ఏడాదిలో హిట్ కొట్టాడా అంటే…జస్ట్ ఓకే సినిమా అని టాక్ వచ్చేసింది. ఇలాంటి సినిమాలకు మంచి టాక్ వస్తేనే జనం ధియోటర్స్ లో కళకళ్లాడతారు.

దానికి తోడు పబ్లిసిటీ పరంగా కూడా ‘పేట’ తెలుగులో పెద్దగా హైప్ లేకుండా విడుదలైంది. సరైన ప్రమోషన్లు లేవు. అప్పటికే ‘పేట’ డబ్బింగ్ హక్కులు కూడా పదిహేను కోట్లకే కొన్నారని టాక్. అయినా సరే అది కూడా రికవరీ అయ్యే పరిస్దితి కనపడటం లేదు. సంక్రాంతికి విడుదలైన స్టైయిట్ సినిమాలు, వివాదం దెబ్బతో ‘పేట’కు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. మొదటి రోజు నామ మాత్రంగా.. స్క్రీన్లు ఇచ్చి రెండో రోజు నుంచి తగ్గించేశారు. హిట్ టాక్ వస్తే కథ వేరే విధంగా ఉండేది. కానీ ఫర్వాలేదు అనే టాక్ మైనస్ అయ్యిపోయింది.

దాంతో మొదటి రోజు ‘పేట’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.1.6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి షాక్ ఇచ్చింది. గతంలో రిలిజైన ‘కబాలి’.. ‘2.0’ సినిమాలకు మొదటి రోజు ఏపీ-తెలంగాణల్లో రూ.10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇప్పుడు ‘పేట’వాటిల్లో 20 శాతం కూడా రికవర్ చేయలేకపోయింది. దాంతో నిర్మాత వల్లభనేని అశోక్ పెట్టిన పెట్టుబడికు తగ్గ షేర్ రావడం కష్టం అంటున్నారు. ఇది కంగారు పెట్టే విషయమే. చూస్తూంటే ఇంకా స్క్రీన్స్ తగ్గిపోయేట్లున్నాయి. ఈ రోజు (శనివారం) రిలీజైన ‘ఎఫ్-2’ కు పాజిటివ్ టాక్ వచ్చింది..దాంతో ‘పేట’కు కష్టం ఇంకా పెరిగిపోయింది.

ఇప్పటికే ఎన్నో సార్లు చూసేసిన రజనీకాంత్ సినిమాల్లోని హిట్ అంశాలను తీసుకుని వాటిని కలుపుతూ ఈ సినిమా చేసారరు. దాంతో పాత సినిమాను మళ్లీ చూస్తున్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా రజనీకాంత్ సూపర్ హిట్ బాషా ని మళ్లీ తీసారు.