‘టాక్సీవాలా’బడ్జెట్ అంత తక్కువా?

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రం నిన్న శనివారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ముందు విడుదలైన ‘నోటా’ విజయ్ దేవరకొండ అభిమానులను చాలా నిరాశకు గురి చేసింది. ఈ సినిమా అయిన మంచి సక్సెస్ సాధిస్తుందని విజయ్ చాలా నమ్మకంతో ఉన్న సమయంలో పైరసీ దెబ్బ కొట్టింది.

అయితేనేం సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో విజయ్ దేవరకొండ ఆనందానికి తిరుగులేదు. పైరసి వచ్చేసినా హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. అలాగే పైరసీ చూసి రివ్యూలు రాసినవారందిరకీ విజయ్ దేవరకొండ మిడిల్ ఫింగర్ చూపినట్లు అయ్యింది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమా కేవలం మూడు కోట్లలో ఫినిష్ చేసారట. దాంతో ఈ వీకెండ్ లోపై ఈ పెట్టుబడి రికవరీ అవుతుందని అంటున్నారు. ఇక గీతా గోవిందం విజయం తో ఈ సినిమాని మంచి రేట్లకే అమ్మారు. వారంతా కూడా ఈ సినిమాకు హిట్ టాక్ రావటంతో ఊపిరి పీల్చుకున్నారు.

సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో చిత్ర యూనిట్‌ మీడియాతో సమావేశమైంది. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఆడియో వేదిక మీద నేను కోరినట్టు ప్రజలందరూ కలిసి థియేటర్లను నింపినందుకు ధన్యవాదాలు’’ అని అన్నారు. దర్శకుడు రాహుల్‌ మాట్లాడుతూ ‘‘టెక్నికల్‌గా సక్సెస్‌ సాధించామని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.

‘‘విజయ్‌ దేవరకొండకి సక్సెస్‌ కొత్తేం కాదు. అతను ఇప్పటికే ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు. ఎస్‌కేఎన్‌కి మాత్రం ఇది తొలి విజయం. తన తొలి చిత్రం విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. మేం ఎంత సపోర్ట్‌ చేసినా, ఈ చిత్ర బృందం చేసిన కృషి గొప్పది’’ అని అల్లు అరవింద్‌ అన్నారు.

తెలుగమ్మాయిని ఎంకరేజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రియాంకా జావల్కర్‌ అన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘‘నిర్మాతగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వంశీ, బన్నీ, అరవింద్‌ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఇంత హైప్‌ రావడానికి విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ కారణం’’ అని తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘టాక్సీవాలా పైరసీ అయినప్పుడు చాలా భయమేసింది. అయితే ప్రేక్షకులు అంతకుమించి హిట్‌ చేసి చూపించారు’’ అని చెప్పారు.