ముంబైలో `సైరా` టీమ్ హ‌ల్‌చ‌ల్‌.. టార్గెట్‌పైనే గురి!

చిరు ఎంట్రీతో ముంబైలో `సైరా` జోరందుకుంటుందా?

చిరంజీవి న‌టిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. తొలి తెలుగు ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా క‌ల‌ర్ పులుముకున్న ఈ చిత్రానికి అదేస్థాయిలో మాత్రం టీమ్‌ ప్ర‌మోష‌న్స్ హోరెత్తించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. `సాహో` సినిమాకు నెల ముందు ఈశాన్య రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్స్‌ ప్లాన్ చేస్తే `సైరా` టీమ్ మాత్రం ఇంకా ఆ విష‌యంలో వెన‌క‌బ‌డే వుంద‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపించాయి. దాంతో చిత్ర బృందం ఆల‌స్యంగా మేలుకుని శుక్ర‌వారం ముంబైలో ప్ర‌చారానికి వెళ్లింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిపిన చిత్ర బృందం ముంబైలో మీడియా ప్ర‌చారాన్ని హోరెత్తించింది. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి, సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న ఫ‌ర్హాన్ అక్త‌ర్ కూడా పాల్గొన్నాడు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో చిరంజీవి చాలా కూల్‌గా క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. ముంబైలో ప్ర‌మోష‌న్స్‌ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ అటు నుంచి చెన్నై, బెంగ‌ళూరు, కొచ్చీ వెళ్ల‌బోతున్నారు. కేర‌ళ‌, క‌ర్ణాట‌క స్టేట్‌ల‌లో `సైరా` ప్ర‌చార ఢంకా మోగించిబోతున్నారు. క‌ర్ణాట‌క‌లో సుదీప్‌, చెన్నై ప్ర‌చారంలో విజ‌య్ సేతుప‌తి, కేర‌ళ ప్ర‌చారంలో మోహ‌న్‌లాల్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.