అమీర్ ఖాన్ మహాభారతం
సిరీస్ ని ప్రకటించిన అనంతరం అల్లు అరవింద్ రామాయణం
చిత్రాన్ని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఇవి నిజంగానే సెట్స్ కెళతాయా? అంటూ అంతా పెదవి విరిచేశారు. అనుకున్నట్టే రకరకాల కారణాలతో మనోభావాల వీరంగం అనే భయంతో అమీర్ వెనక్కి తగ్గాడు. మహాభారతం ఇప్పట్లో సెట్స్ కెళ్లదు అని అర్థమైంది. అయితే రామాయణం చిత్రాన్ని మాత్రం అల్లు అరవింద్ ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకెళ్లాలని తన వంతు ప్రయత్నం చేయడం ఆసక్తికరం. అప్పట్లో కేరళ ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టు విషయమై ఓ ఒప్పందం కుదుర్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
అనుకున్నట్టే అల్లు వారి రామాయణం పట్టాలెక్కబోతోంది. ఇక ఇందుకు ఎంతో సమయం లేదని అర్థమవుతోంది. ట్యాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ప్రస్తుతం రామాయణం చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీ అవుతున్నారు. దంగల్ లాంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నితీష్ ఇటీవలే చిచ్చోర్ లాంటి మరో క్లాసిక్ తో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రామాయణం లాంటి భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అరవింద్, మధు మంతెన బృందం దాదాపు 600 కోట్ల బడ్జెట్ ని వెచ్చించింది. దీనిని ఒక ట్రయాలజీ తరహాలో తీస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ తదుపరి చిత్రం రామాయణం
గురించి కొన్ని లీకుల్ని ఇచ్చారు. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. కాన్సెప్టు పరంగా వర్క్ చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో శ్రీరాముడి పాత్రకు హృతిక్ ని.. సీత పాత్రకు దీపికను సంప్రదించారా? అన్న ప్రశ్నకు ఇంకా అలాంటిదేమీ లేదని తెలిపారు. అవన్నీ రూమర్లు మాత్రమేనని అన్నారు. ఇంకా ఈ ప్రాజెక్టు ఆరంభ దశలో ఉంది. ఇకపై పూర్తిగా దృష్టి సారిస్తామని తెలిపారు. అయితే నిర్మాతల వైపు నుంచి వేరొక రకమైన ప్రచారం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో హృతిక్ రోషన్ శ్రీరాముడిగా ఫిక్సయ్యాడని.. సీతాదేవి పాత్రకు దీపికను ఫైనల్ చేశారని ప్రచారమవుతోంది. అలాగే ఈ చిత్రంలో సౌత్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రావణుడిగా నటిస్తే బావుంటుందని భావిస్తున్నారని ఆ మేరకు ప్రపోజల్స్ వెళ్లాయని తెలుస్తోంది. హృతిక్ – ప్రభాస్- దీపిక రైట్ ఛాయిస్. వీళ్లు అంగీకరిస్తే ఈ ప్రాజెక్టుకు ఎంతో ఆకర్షణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో మరిన్ని కీలక పాత్రలు ఉన్నాయి. ఆంజనేయుడి పాత్ర సహా లక్ష్మణుడు, శూర్పణక వంటి పాత్రలకు ఇంపార్టెంట్ నటుల్ని తీసుకోవాల్సి ఉంటుంది.