ఎలక్షన్స్ కోసం రాజకీయ పార్టీలు గ్లామర్ ని తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మాజీ హీరోయిన్స్ ,హీరోలు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్(51) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి అభ్యర్థుల వేటలో పడింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది.
2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో పూణె లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించేందుకు బిజెపి సిద్దమైంది. ఈ ఏడాది జూన్‌లో సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మాధురీ దీక్షిత్ ఆమె నివాసంలో కలిసిన విషయం తెలిసిందే.
‘సంపర్క్ ఫర్ సంవిధాన్’ కార్యక్రమంలో భాగంగా ఆమెను కలిసిన షా…నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత మాట్లాడుతూ… పూణె లోక్‌సభ నుంచి పోటీ చేసే లిస్ట్‌లో ఆమె పేరు ఉన్నట్లు తెలిపారు.
ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా యోచిస్తోందని తెలిపారు. ఇక్కడ నుంచి మాధురిని నిలబెట్టడం అన్నివిధాలా సరైన నిర్ణయమని అన్నారు. కాగా 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి అనిల్ షిరోల్…కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.