‘వారాహి’ని వైసీపీ సీరియస్‌గా తీసుకున్నది అందుకేనా.?

నో డౌట్, జనసేన పన్నిన వ్యూహంలో వైసీపీ చిక్కుకుని గిలగిల్లాడుతోంది ‘వారాహి’ విషయంలో. రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిన వాహనానికి సంబంధించిన టీజర్ విడుదల చేసి, వైసీపీని బొక్క బోర్లా పడేలా జనసేన అధినేత చేయగలిగారు.

ఈ విషయం తెలిసి కూడా వైసీపీ ఎందుకు ఇంకా ‘వారాహి’ విషయంలో యాగీ చేస్తోంది.? ‘వారాహి’ అనే ఓ వాహనాన్ని చూసి భయపడాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది.?

మంత్రులు ఇంకా ‘వారాహి’ వాహనం గురించి మాట్లాడుతున్నారు. తమ అజ్ఞానాన్ని చాటుకుంటూనే వున్నారు. ‘వారాహి’కి పసుపు రంగు వేసుకోవాలని ఆ పసుపు పార్టీ నుంచే రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ప్రస్తుత వైసీపీ నేత, మంత్రి రోజా విమర్శిస్తున్నారు.

అయితే, ఇక్కడ వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. ‘వారాహి’ని హైలైట్ చేయడం ద్వారా ఏపీ రాజకీయాల్లో టీడీపీ సౌండ్ తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందిట. గత కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది తప్ప, ఎక్కడా టీడీపీ అనే మాట సోదిలో కూడా లేదు.

వైసీపీ వ్యూహాత్మకంగానే ఈ టర్న్ తీసుకుంటే, అది వైసీపీకి ఎంత అడ్వాంటేజ్ అన్నది ముందు ముందు తేలుతుంది.! ఒకవేళ వైసీపీ, అయోమయంతోనే ఈ ట్రాప్‌లో పడటం నిజమైతే.. అంతకన్నా ఆ పార్టీకి చావు దెబ్బ ఇంకోటి వుండదు.ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జనసేన పార్టీకి విపరీతమైన మైలేజ్ వచ్చింది.