వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: సీబీఐ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ.!

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ నిమిత్తం సీబీఐ యెదుట హాజరయ్యారు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి. అవినాష్ రెడ్డి కూడా వైఎస్ కుటుంబ సభ్యుడే. పంపకాల్లో తేడాల కారణంగా వైఎస్ వివేకా హత్య జరిగిందంటూ వైఎస్ అవినాష్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగాక ఇంట్లో రక్తపు మరకల్ని తుడిచేయడం, దారుణ హత్యని గుండె పోటుగా ప్రచారం చేయడం.. ఇలా పలు అరోపణలు అవినాష్ రెడ్డి మీద వున్నాయి. అయితే, ఈ కేసులో సాక్షిగా మాత్రమే అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిందనేది ఓ వాదన. గత కొంతకాలంగా సీబీఐ విచారణను తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.

ఏళ్ళు గడుస్తున్నా వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడటంలేదంటే, తెరవెనుకాల పెద్ద కథే నడిచి వుండాలన్నది బహిరంగ రహస్యం. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారాన్ని రాజకీయంగా ఇష్టమొచ్చినట్లు వాడేశాయి తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఎవరు చంపారు.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. వివేకా కుమార్తె మాత్రం ఒంటరిగానే న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సీబీఐ చేతికి వెళ్ళింది.. కేసు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి బదిలీ అయ్యింది.