ప్రభుత్వోద్యోగుల్ని ఉపయోగించుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతనే అని ఒకప్పుడు చెప్పుకునేవారు. ఆయనంత ఘనాపాటి వేరొకరు లేరని బాకా ఊదేవారు. జన్మభూమి పేరుతో చంద్రబాబు ఉద్యోగుల్ని రోడ్లపై తిప్పుతుంటే ఎంత గొప్ప సీఎం అని పొగిడేసేవారు. అయితే ప్రస్తుత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే `తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలదన్నేవాడొకడుంటాడు` అన్న చందంగానే ఉంది. ఉద్యోగుల్ని ఫుల్ గా పిండేయడంలో యంగ్ సీఎం దూకుడు చూస్తుంటే ఔరా! అనిపించక మానదు.
అసలు కరోనా ఉత్పాతాన్ని కానీ ఆయన ముందే గ్రహించారో ఏమో కానీ దీనికోసమే ఒక వ్యవస్థను తయారు చేసినట్టుగా అప్పటివరకూ ఆయన చేసుకున్న రిక్రూట్ మెంట్లు ఎంతో గొప్పగా వర్కవుటవుతున్నాయి. గ్రామీణ స్థాయిలో ఆ ఫలాలు అందుతుంటే దీనికి ప్రతిపక్షాలు సైతం నోర్మూసుకోవాల్సిన సన్నివేశమే కనిపిస్తోంది. అయినదానికి కానిదానికి విమర్శలతో తెగబడే చంద్రబాబు సైతం ఈ ఉద్యోగుల పనితీరు చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది. అమ్మమ్మ తాతయ్యలకు ఫించను అందించడమేనా.. ఇళ్లకు వెళ్లి మరీ ప్రజా సమస్యల గురించి వలంటీర్లు- సెక్రటరీలు తెలుసుకుంటున్నారు. కరోనా వేళ వేణ్ణమ్మలు, ఆశా వర్కర్లతో కలిసి పని చేస్తున్నారు. ప్రజారోగ్యంపైనా ఆరాలు తీస్తున్నారు. ప్రతి సమస్యను ఏకరువు పెడుతుంటే వింటున్నారు. ఇంత మంచి వ్యవస్థకు జగన్ పురుడు పోసిన తీరు ప్రశంసనీయం అన్న చర్చ సాగుతోంది. కేవలం రూ.5వేలు.. రూ.15 వేలకే ఉద్యోగులు దొరుకుతారా? అన్న సెటైర్లు కొందరు వేస్తున్నా అదే కదా! చాణక్యం అని పొగిడేవాళ్లు లేకపోలేదు.
ప్రస్తుతం ఓవైపు కరోనా కల్లోలం.. లాక్ డౌన్ లతో రాష్ట్రానికి ఆర్థిక కష్టం.. ఇంకోవైపు అప్పటికప్పుడు ఊపిరి సలపనీకుండా రకరకాల సమస్యలు.. నిన్నటి వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనతో భారీ ఆర్థిక వితరణ .. ఇవన్నీ ఊపిరాదనివ్వని పరిస్థితి. ఇక రాజధాని ఇష్యూలోనూ మొండివాడిగా జగన్ వెళుతున్న తీరు.. సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు చూస్తుంటే యంగ్ సీఎం ఎందులోనూ తగ్గడా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంలో పోలీసులు.. ప్రజా ప్రతినిధులు సహా వలంటీర్లు.. సెక్రటరీలు పరుగులు పెట్టారు. ప్రజల్ని కాపాడేందుకు పోటీపడ్డారు. ఈ సాయం కూడా జగన్ ముందు చూపుతోనే సాధ్యమైందేమో. ఇకపోతే కరోనా కల్లోలంలో అదుపుతప్పే జనాల్ని అదుపు చేసేందుకు టీచర్లను ఉపయోగించారన్న ప్రచారం ఇంతకుముందు సాగింది. అంటే ఆ రకంగానూ ఉద్యోగుల్ని పిండేశారని భావించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్ని ఉప్పెనలు వచ్చినా జగన్ తయారు చేసిన ఉద్యోగ వ్యవస్థ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ చేసిన సర్వేయర్లను అటు సచివాలయంలో పనికి కూడా ఉపయోగించేసుకుంటూ ఘనాపాటి అనిపిస్తున్నారట సీఎం. మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చింది ఇంట్లో కూచోబెట్టేందుకు కాదు.. పని చేసేందుకు అని నిరూపిస్తున్నారు. పిండడంలో అందెవేసిన చేయి అని ప్రూవ్ చేస్తున్నారు మరి!