Kodali Nani: పట్టు కోల్పోతున్న కొడాలి నాని.. గుడివాడలో ఊహించని ట్విస్ట్!

గుడివాడ రాజ‌కీయాల్లో ఇప్ప‌టికీ చ‌ర్చ‌ల‌కు కేంద్రంగా నిలుస్తున్న పేరు కొడాలి నాని. దూకుడైన స్వభావంతోనే కాకుండా, మైనారిటీ, బీసీ వ‌ర్గాల‌ను సమీకరిస్తూ సుదీర్ఘకాలంగా నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు తలనొప్పిగా మారుతున్నాయి. గ‌తంలో ఎంతో సన్నిహితుడిగా ఉన్న మైనారిటీ నేత మహమ్మద్ ఖాసిం పార్టీకి రాజీనామా చేసి నానిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ఇప్పుడు స్థానిక రాజ‌కీయాల్లో కలకలం రేపుతోంది.

ఖాసిం నాయకుడిగా బలమైన ఓటు బ్యాంక్‌ను సమీకరించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ముస్లిం వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసే ప్రక్రియలో ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇటీవలి ఎన్నికల సమయంలో కూడా ఖాసిం బలంగా నాని పక్కన నిలిచారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. “నాని మారిపోయారు, పార్టీలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు” అని ఖాసిం తెగేసి చెప్పడం విశేషం.

ఇంతకీ ఈ పరిణామం వల్ల గుడివాడలో వైసీపీ బలం డైల్యూట్ అయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే, మైనారిటీ ఓటు బ్యాంక్ అక్కడ ఓ కీలక శక్తిగా మారింది. ఖాసిం వంటి నేతను కోల్పోవడం అంటే, ఓ భాగం గడ్డకట్టినట్టు అవుతుంది. పైగా, ఈ వ్యాఖ్యలతో నాని పార్టీపై నియంత్రణ కోల్పోతున్నారన్న విమర్శలు కూడా ఊపందుకుంటున్నాయి.

ఇక నాని ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? పాత నమ్మకస్థుడి విమర్శలను ఎలా ఎదుర్కొంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పునరుద్ధరణలో నాని మరోసారి త‌న క్యాడర్‌ను మోటివేట్ చేయగలరా? లేక నాయ‌కత్వంలో త‌రుగుద‌ల జ‌రిగిందా? అనే చ‌ర్చ వాస్త‌వంగా మారుతుందా? అన్న‌దే వేచి చూడాల్సిన సంగ‌తి.