త్వరలో “యాత్ర-2”… ఈ సారి హీరో జగన్!

గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ పాదయాత్రపై వచ్చిన సినిమా “యాత్ర”. ఆ సినిమా జగన్ ఎన్నికల ప్రచారానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు. నాడు వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర, ప్రజలకు ఇచ్చిన హామీలు, అసలు ఆ హామీలివ్వడానికి కారణం అయిన సమస్యలు, యాత్ర సమయంలో వైఎస్సార్ ఎదుర్కొన్న సవాళ్లు… వెరసి, సినిమా సూపర్ హిట్ అయింది. “నేను విన్నాను – నేను ఉన్నాను” అనే మాటైతే.. జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో… యాత్ర-2 ను త్వరలో తెరకెక్కించాలని ఫిక్సవుతున్నారు టీం.

2024 ఎన్నికలకు ఒక నెల ముందు “యాత్ర-2” సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారంట మేకర్స్. ఆ సినిమా ఎక్కడ ముగిసిందో.. రెండోపార్టు కరెక్టుగా అక్కడనుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు. అంటే వైఎస్సార్ సీఎం కావడం ఆయన అయిదేళ్ల పాలన తరువాత యాక్సిడెంట్ లో మరణించడంతో జగన్ ఎలా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు ఆయన ఎలా రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కొన్నారు. చివరికి సీఎం ఎలా అయ్యారు అన్న కంటెంట్ తో యాత్ర టూ తెరకెక్కనుందన్నమాట.

రాజశేఖర్ రెడ్డి కొడుకుగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన జగన్… అతితక్కువ సమయంలో ఇంతపెద్ద నాయకుడిగా మారిన పరిణామ క్రమాన్ని, కీలక పరిణామాలను, ఆ సమయంలో జగన్ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను క్లియర్ గా చూపించబోతున్నారంట. ప్రస్తుతం కాస్టింగ్ సెలక్షన్ లో ఉన్న యూనిట్… అచ్చం జగన్ లా ఉండే నటుడిని తమిళనాడు నుంచి ఎంపిక చేశారని తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నెలముందు ఈ సినిమా విడుదలవ్వొచ్చని తెలుస్తుంది.