Pawan Kalyan Yatra in AP: అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగుతున్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఈ ఐడీ కార్డుల బాగోతం ఏమీ లేదు. కానీ, ఇప్పుడు సీన్ మారింది.
మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘యాత్ర’ ద్వారా జనంలోకి వెళితే, అప్పుడెలాంటి నిబంధనలు తెరపైకొస్తాయ్.? ఈ విషయమై జనసేన వర్గాల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనాని యాత్ర అంత తేలిక కాదనీ, ప్రభుత్వం నానా రకాల ఇబ్బందులూ పెడుతుందనీ జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.
న్యాయ పోరాటం చేసి యాత్రకు అనుమతి తెచ్చుకోవాలనుకున్నా, ఐీడీ కార్డుల లాంటి ఆంక్షలు ఎదురైతే ఎలా.? అన్న దిశగా జనసేన ముఖ్య నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. ఓ పక్క జనసేనాని యాత్ర కోసం వినియోగించే వాహనం దాదాపు రెడీ అయిపోయింది.
రూట్ మ్యాప్ తయారీ పనుల్లో జనసేన పార్టీ ముఖ్య నేతలు బిజీ బిజీగా వున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత ఏ క్షణాన అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర మొదలవ్వచ్చు. కానీ, యాత్రలో ఎక్కువమంది పాల్గొనకూడదు.. ప్రత్యేక వాహనంలో పైనుంచి మాట్లాడకూడదు.. జనానికి అభివాదం చేయకూడదు.. అనే నిబంధనలు తెరపైకి తెస్తే ఎలా.? అమరావతి రైతుల పాదయాత్రకు ఎదురవుతున్న ఆటంకాల నేపథ్యంలో, అలాంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలన్నదానిపై జనసేన లీగల్ టీమ్ కూడా సర్వసన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.