టీడీపీని కాదని, బీజేపీకి రామోజీరావు మద్దతిస్తారా.?

బీజేపీని ఎవరైనా కాదనుకుంటే ఏం జరుగుతుంది.? సీబీఐ వెళుతుంది.. లేదంటే, ఈడీ వెళుతుంది.. ఇదీ గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో జరుగుతోన్న చర్చ. మరీ హేయంగా దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రత్యర్థులపైనకే కాదు, సంస్థలు.. వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టేలా ఉసిగొల్పుతోంది బీజేపీ.. అన్న విమర్శలు లేకపోలేదు. సరే, ఈ వాదనలో నిజమెంత.? అన్నది వేరే చర్చ.

అమిత్ షా – రామోజీరావు భేటీ తర్వాత, ఈ అంశంపై మీడియా, రాజకీయ వర్గాల్లో బోల్డంత చర్చ జరుగుతోంది. ‘ఏమో, రామోజీరావుకి భారతరత్న ఇస్తారేమో..’ అంటూ ఓ పెద్దాయన (గతంలో రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్న మేధావి..) సెలవిచ్చారు. ఔనా.? రామోజీరావుకి భారతరత్న ఇస్తారా.? ప్రతిగా రామోజీరావు, బీజేపీకి ఏం సహాయ సహకారాలు అందించనున్నారట.?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! ఏం, ఎందుకు రామోజీరావుకి భారతరత్న ఇవ్వకూడదు.? తెలుగనాట మీడియా మొఘల్ ఆయన. దేశవ్యాప్తంగా న్యూస్ నెట్‌వర్క్ వుందాయనకి. మీడియా రంగంలో ఆయనో సంచలనం. అంతే కాదు, ‘రాజగురువు’గా కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారన్న గుర్తింపు వుంది. అంతేనా.. చాలా వున్నాయ్. తన ఫిలిం సిటీని ఎక్కడ గులాబీ పార్టీ లక్ష నాగళ్ళతో దున్నేస్తుందోనన్న భయంతో, గులాబీ సర్కారుకి వంగి వంగి దండాలు పెడుతున్నారన్న విమర్శలూ వున్నాయి.

సినిమాల్ని గతంలో నిర్మించారు.. ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు వున్నాయ్.. చెప్పుకుంటూ పోతే, రామోజీరావు ఘనతలు తక్కువేమీ కాదు. మరీ ‘భారతరత్న’ పురస్కారం ఇచ్చేయడం సబబు కాకపోవచ్చుగానీ.. మీడియా రత్నంగా రామోజీరావుని అభివర్ణించొచ్చు.

అసలు ఇలాంటి చర్చ ఇప్పుడెందుకు జరుగుతోంది.? ఎన్నికలకు ముందర రామోజీరావుని ప్రసన్నం చేసుకోవడానికి అమిత్ షా ఎందుకు ప్రయత్నించారు.? ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారా.? లేదంటే, స్వీట్ వార్నింగ్ ఇచ్చారా.? ఇలా మళ్ళీ బోల్డన్ని చర్చోపచర్చలు.