మోహన్ బాబు అక్కడ నుంచి పోటీ చేస్తాడా ?

సినిమా నటుడు పద్మశ్రీ మోహన్ బాబు జగన్ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడా ? గత కొంత కాలంగా మోహన్ బాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబును విమర్శిస్తున్నారు . వైఎస్సార్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు . నిజానికి చంద్ర బాబు నాయుడు, మోహన్ బాబు ఇద్దరు చిత్తూర్ జిల్లాకు చెందిన వారు మాత్రమే కాదు , బంధువులు కూడా . ఎన్టీ  రామా రావుకు మోహన్ బాబు అభిమాని .  ఆయనతో మేజర్  చంద్ర కాంత్ అనే సినిమా కూడా తీశాడు . 1995లో రామారావు మోహన్ బాబుకు రాజ్య సభ సభ్యుడుగా  ఎంపిక చేశాడు . అయితే  రామారావు ను పార్టీ నుంచి చంద్ర బాబు నాయుడు  దించేశాక  మోహన్ బాబు చంద్ర బాబు వైపు వచ్చేశాడు . అప్పట్లో లక్ష్మి పార్వతి విశ్వాసం లేనివాడు అంటూ మోహన్ బాబును విమర్శించింది కూడా . అయితే కొన్నాళ్లకే మోహన్ బాబు చంద్ర బాబుకు చెడింది . ఎందుకు అనేది ఎవరికీ తెలియదు .

2003లో  మోహన్ బాబు తన కుమారుడు విష్ణు ను హీరోగా పరిచయం చేసెటప్పుడు మాత్రం చంద్ర బాబు ఇంటికి వెళ్లి ఆహ్వానించాడు . చంద్ర బాబు  అప్పుడు ముఖ్య మంత్రిగా వున్నాడు .  2009 లో  మోహన్ బాబు  తన కుమారుడు విష్ణు కు సిసి  రెడ్డి మనవరాలు విరానికతో వివాహం జరిపించాడు . సిసి రెడ్డి కూతురును డాక్టర్  వైఎస్  రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడు  సుధాకర్ రెడ్డి వివాహం చేసుకున్నాడు . ఈ రకంగా వైఎస్  కుటుంబంతో మోహన్ బాబుకు చుట్టరికం ఏర్పడింది . అప్పటి నుంచి చంద్ర బాబు కు మోహన్ బాబు మరింత దూరమయ్యాడు . వైఎస్  జగన్ కు దగ్గరయ్యాడు .

వైజాగ్ విమానాశ్రయంలో  జగన్ మీద హత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసి  ఆ చర్యను మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించాడు . జగన్ త్వరగా కోలుకోవాలని చెప్పాడు . ఈరోజు మోహన్ బాబు  జగన్ నివాసానికి వెళ్లి స్వయంగా పరామర్శించాడు .  జగన్ కు  సన్నిహితం   అవుతున్న మోహన్ బాబు వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు  ఉన్నట్టు చెబుతున్నారు .

చంద్ర బాబు నాయుడు కూడా కుప్పం నియోజక వర్గాన్ని కుమారుడు లోకేష్ కి ఇచ్చి తాను  తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి . చంద్ర బాబు మీద మోహన్ బాబు పోటీకి దిగుతాడా ? ఎం జరగ బోతున్నది ? అతి త్వరలోనే మోహన్  బాబు క్రియాశీలక  రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వుంది .