చంద్రబాబును క్షమించరు సరే…మరి మోడిని క్షమిస్తారా ?

‘చంద్రబాబునాయుడును ఏపి క్షమించదు’… ఇది చంద్రబాబును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడి తాజాగా చేసిన వ్యాఖ్య. ఎందుకు క్షమించరంటే ఎన్టీయార్ ఆశయాలకు విరుద్దంగా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నందుకట. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీని పెట్టారని మోడి గుర్తుచేశారు. ఎన్టీయార్ ఆశయాలకు చంద్రబాబు తిలోదకాలిచ్చి అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబును ఏపి ప్రజలు ఎన్నటికీ క్షమించరంటూ చెప్పటం  విచిత్రంగా ఉంది. మోడి ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు ? ఏపి నేతలతో మాట్లాడుతూ కాదు సుమా. తమిళనాడులోని తిరువళ్ళూరు తదితర ప్రాంతాల  బిజెపి బూత్ కమిటీల సభ్యులతో జరిగిన టెలికాన్ఫరెన్సులో.

 

నిజానికి తమిళనాడులోని బూతు కమిటీ సభ్యుల టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు గురించి మాట్లాడితే ఏమిటి ఉపయోగం ? మాట్లాడేదో  తెలుగురాష్ట్రాల్లోని బిజెపి నేతల టెలికాన్ఫరెన్సులో మాట్లాడినా అర్ధముంటుంది. సరే సందర్భం ఏదైనా కానీ మోడి మాట్లాడిన దాంట్లో ఓ అర్ధముంది. కాంగ్రెస్ తో కలిసినందుకు చంద్రబాబును ప్రజలు క్షమించరని మోడి చెప్పిన మాట యదార్ధమే. ఎందుకంటే మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి పొత్తులను జనాలు చీ కొట్టారు. టిడిపితో పొత్తు పెట్టుకున్న పాపానికి కాంగ్రెస్ కూడా దారుణంగా దెబ్బతిన్నది. ఇక, ఏపిలో రేపటి ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.

 

సరే ఆ విషయాలను పక్కనపెడదాం. పొత్తుల విషయంలో చంద్రబాబును క్షమించని జనం ఏపి అభివృద్ధికి మోడి చేసిన ద్రోహాన్ని మాత్రం ఎలా క్షమిస్తారు ?  రాష్ట్ర విభజన చట్టాన్ని మోడి ఎందుకు అమలు చేయలేదు ? ఏపి అభివృద్ధికి  విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ను ఎందుకు అమలు చేయలేదు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, బిజెపిలు హామీ ఇచ్చే కదా  రాష్ట్రాన్ని విడగొట్టారు ? పోయిన ఎన్నికల సమయంలో కూడా ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశంపై మోడి ఎన్నో సభల్లో ప్రసంగాలు చేశారు కదా ?

 

ఎన్నికలకు ముందు తామిచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదంటే మోడి కూడా ఏపిని మోసం చేసినట్లే. అంటే చంద్రబాబు మీద వ్యక్తిగత కోపంతోనే మోడి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లు అర్ధమైపోతోంది. వ్యక్తిమీద కోపంతో రాష్ట్రాభివృద్ధిని దెబ్బకొట్టటానికి సైతం మోడి సిద్ధపడ్డారంటే ఏమనర్ధం ? మరి ఏపిని మోసం చేసిన మోడిని, బిజెపిని మాత్రం ప్రజలు ఎలా క్షమిస్తారు ? మోడిని జనాలు ఎట్టి పరిస్దితుల్లోను క్షమించరన్న విషయం మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో నిరూపితమైంది కదా ? తెలంగాణా ఎన్నికల్లో జనాలు చంద్రబాబును మాత్రమే కాదు బిజెపిని తిరస్కరించటం ద్వారా మోడికి వాతలు పెట్టినట్లే అర్ధమవుతోంది. రేపటి ఏపి ఎన్నికల్లో చంద్రబాబు విషయాన్ని పక్కనపెట్టినా మోడికి మాత్రం జనాలు వాతలు పెట్టటం ఖాయమనే అర్ధమవుతోంది.