జూనియర్ ఎన్టీఆర్ ను ఏపీ ప్రజలు నమ్ముతారా.. ఆ పరిస్థితి రిపీట్ అవుతుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే దాదాపుగా లేదని ఇప్పటికే తేలిపోయింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వయస్సు 39 సంవత్సరాలు కాగా సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉన్న తారక్ ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటించే విధంగా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు తారక్ తో పని చేయడానికి పాన్ ఇండియా డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పుడు తారక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తారక్ ను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తోంది. అంచనాలు వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందువల్ల ఆయన సులభంగా ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యమైంది.

చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అవుతానని భావించినా 2009 ఎన్నికల ఫలితాలు ఆయనకు భారీ షాకిచ్చాయి. చిరంజీవిపై ప్రజల్లో సదభిప్రాయం ఉన్నా ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నా ఆ పార్టీకి వరుసగా భారీ షాకులు తగులుతున్నాయనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ఏపీలో ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమవుతోంది. అయితే తారక్ కు సొంతంగా టీడీపీ ఉన్న నేపథ్యంలో సరైన సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రమే తారక్ సత్తా చాటడం సాధ్యమవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ సైతం భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో వెల్లడిస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు. తారక్ రాజకీయాలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయనే సంగతి తెలిసిందే.