పవన్ ను ఎవరైనా నమ్ముతారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎవరైనా నమ్ముతారా ? సీట్ల సర్దుబాటు సందర్భంగా చంద్రబాబునాయుడుతో క్విడ్ ప్రో కో వ్యవహారం బట్టబయలైన తర్వాత కూడా పవన్ చిత్తశుద్దిని జనాలు నమ్ముతున్నారని ఎవరూ అనుకోవటం లేదు.  అన్నీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోరాటం చేస్తామని ఎన్నోమార్లు చెప్పారు. తీరా నామినేషన్లు ప్రక్రియ ఊపందుకున్న తర్వాత సీట్ల సర్దుబాటును చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.

జనసేన తరపున పోటీ చేయబోతున్న అభ్యర్ధులను చూస్తుంటే చంద్రబాబు, పవన్ మధ్య సంబంధాలపై అనుమానాలు బలపడుతున్నాయి. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన అభ్యర్ధి ఉంటే లోకేష్ కు ఇబ్బందులని ఆ సీటును సిపిఐకి వదిలిపెట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ కోసమని ఆ సీటును సిపిఎంకు వదిలిపెట్టారు.

ఇక విశాఖపట్నం జిల్లాలోని భీమిలీలో జేడి లక్ష్మీనారాయణ కోసమని,  అలాగే గాజువాకలో పవన్ పోటీ చేయబోతున్నారని, ఎందుకైనా మంచిదని పెందుర్తి నియోజకవర్గాన్ని చాలా రోజులు రిజర్వులో ఉంచారు. ఇక్కడ టిడిపి తరపున ఐదుసార్లు గెలిచిన బండారు సత్యనారాయణమూర్తికి మంగళవారం తెల్లవారి జామున టికెట్ ప్రకటించారు.

అదే విధంగా దళితుల ఓట్లు ఏకపక్షంగా వైసిపికి పడుతుందేమో అన్న అనుమానంతో బిఎస్పీతో జనసేన పొత్తుకు చంద్రబాబే సయోధ్య కుదిర్చారట. అదేవిధంగా జనసేనలో కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ కోసం పార్టీ సీనియర్ నేత సిట్టింగ్ ఎంఎల్ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను మార్చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరి మధ్య క్విడ్ ప్రో కో స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబును జనాలు ఎటూ నమ్మరు. చంద్రబాబుతో కలిసినందు వల్ల ప్రజలు పవన్ నమ్ముతారా ? అన్నదే ప్రశ్న.