ఈమధ్యనే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ మాట చెప్పారు. ‘మళ్ళీ అధికారంలోకి రారని పోలీసులకు తెలిస్తే ఎంఎల్ఏకి కూడా పోలీసు సెల్యూట్ కొట్టరు ’ అని. చంద్రబాబు కాకినాడ పర్యటన చూస్తే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి.
నాలుగు రోజుల క్రిందట చంద్రబాబునాయుడు కాకినాడలో పర్యటించిన విషయం గుర్తుందికదా ? కాకినాడలో చంద్రబాబు బిజెపి కార్పొరేటర్లు, నేతలు అడ్డుకున్నారు. అప్పుడు ఓ మహిళా కార్పోరేటర్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ‘తనను అడ్డుకుంటే ఫినిష్ అయిపోతావంటూ’ చాలా నీచంగా మాట్లాడిన విషయం కూడా గుర్తుంది కదా ? ఇపుడా అంశంమీదే ప్రభుత్వంలోని ఉన్నతస్దాయిలో పెద్ద చర్చే జరుగుతోందట. కాకినాడకు చంద్రబాబు వస్తున్న నేపధ్యంలో అడ్డుకునేందుకు బిజెపి నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ సిబ్బంది ముందురోజే నివేదిక అందించారట. ఆ నివేదిక జిల్లా పోలీసు అధికారులకు కూడా అందిట. అంటే బిజెపి నేతలు సిఎంను అడ్డుకుంటున్నారనే ప్లాన్ లో ఉన్నారన్న విషయం అందిరికీ ముందే తెలుసు.
బిజెపి నేతల ముందస్తు ప్లాన్ గురించి ముందే తెలిసినా కాకినాడ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు ? ఇపుడిదే అంశం చాలా సీరియస్ గా నలుగుతోంది అమరావతిలోని ఉన్నతస్ధాయి వర్గాల మధ్య. సిఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. ఎవరన్నా అడ్డగించినా అడ్డగించకపోయినా పోలీసులైతే తగిన జాగ్రత్తల్లో ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ గేర్లో నడిచారు పోలీసు అధికారులు. బిజెపి నేతల ప్లాన్ ముందే తెలిసినా జిల్లా అధ్యక్షుడిని మాత్రమే ముందస్తు అదుపులోకి తీసుకుని మిగిలిన వాళ్ళ గురించి పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.
అదే అదునుగా బిజెపి నేతలు చంద్రబాబు వాహనానికి అడ్డం పడటం, చంద్రబాబు రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడటంతో అదో పెద్ద ఇష్యు అయ్యింది. మహిళా కార్పొరేటర్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. అసలు ఈ పరిస్ధితిని నివారించాల్సిన పోలీసులు ఎక్కడా పట్టించుకోలేదట. అంతేకాకుండా సభ జరిగిన జెఎన్టియు మైదానంలో కూడా పోలీసులు పెద్దగా లేరట. అసలక్కడ సిఎం సభ జరుగుతోందన్న స్పృహ కూడా పోలీసుల్లో ఉందో లేదో అన్న అనుమానం వచ్చిందట టిడిపి నేతలకు. సభకొచ్చిన జనాలు మధ్యలోనే వెళ్ళిపోతున్నా, అల్లరి చేస్తున్నా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదట.
పోలీసుల వైఖరి ఈ విధంగా ఉంటే ఇక ఎంఎల్ఏల తీరు మరింత విచిత్రంగా ఉందట. జన్మభూమి కార్యక్రమాలను చంద్రబాబు అధికారిక కార్యక్రమమో లేకపోతే పార్టీ కార్యక్రమమో కూడా తెలీనంతగా మార్చేశారు. అందుకే చాలా చోట్ల అధికారిక కార్యక్రమమంటూ పార్టీ నేతలు దూరంగా ఉంటున్నారు. కొన్నిచోట్ల అది పార్టీ కార్యక్రమం అనుకుని అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. కాకినాడలో సిఎం హాజరైన కార్యక్రమం అధికారిక కార్యక్రమం కాబట్టి తమకేమీ సంబంధం లేదని కాకినాడ రూరల్, కాకినాడ ఎంఎల్ఏలు ఇద్దరూ అంటి ముట్టనట్లున్నారట. పోనీ అధికారులైనా సక్రమంగా ఏర్పాట్లు చేశారా అంటే అదీ లేదు. అందుకే సభలో గందరగోళమైంది. అంటే అటు అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇటు ఎంఎల్ఏలు కూడా అంటీముట్టనట్లు ఉంటున్నారన్న విషయం అర్ధమైంది. అందుకే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.