చంద్రబాబులో  ‘ఆపరేషన్ గరుడ’ టెన్షన్

చంద్రబాబునాయుడుపై ఆపరేషన్ గరుడ ఒత్తిడి పెరిగిపోతోంది. ఆపరేఫన్ గరుడ బ్రాండ్ అంబాసిడర్ శివాజిని అరెస్టు చేయాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిపోతోంది. నిజానికి ఆపరేషన్ గరుడ అంటూ కొంతకాలంగా అవుడేటెడ్ సినీనటుడు శివాజి కొంత హడావుడి చేస్తున్నారు. మొదట్లో ఎవరూ శివాజి మాటలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. త్వరలో కొందరిపై ఐటి దాడులు జరుగుతాయన్నారు. తర్వాత ప్రతిపక్ష నేతపై ప్రాణాపాయం లేని విధంగా దాడి జరుగుతుందని చెప్పారు. ఎటూ సినిమాలు లేవుకాబట్టి ఏదో ప్రచారానికి కథలు చెబుతున్నారని అందరూ కొట్టిపాడేశారు.

 

ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత తాను, లోకేష్ తో పాటు కొందరు కీలక నేతలు లక్ష్యంగా దాడులు జరగవచ్చని స్వయంగా చంద్రబాబే ఎన్నోసార్లు చెప్పారు. అప్పుడు కూడా ఎవరూ చంద్రబాబు మాటలను పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ నేతల టార్గెట్ గా తెరవెనుక ఏదో జరుగబోతోందనే వాతావరణం మాత్రం టెన్షన్ ను పెంచేస్తోంది. సరే, మొత్తానికి చంద్రబాబు చెప్పినట్లుగానో లేకపోతే అంతకుముందు శివాజి చెప్పినట్లే ఐటి దాడులు జరిగాయి.

 

తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ తో పాటు ఎంఎల్ఏ పోతుల రామారావు, మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు తదితరులపై ఐటి దాడులు జరిగాయి. దాంతో శివాజి చెప్పిన ఆపరేషన్ గరుడ ప్రస్తావన మొదలైంది. ఈ నేపధ్యంలోనే విశాఖపట్నం విమానాశ్రయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. గతంలో శివాజి చెప్పిన ఆపరేషన్ గరుడ వివరాల ప్రకారమే ఘటనలు జరుగుతుండటంతో ఇపుడందరూ శివాజిపై ఫోకస్ పెట్టారు. నిజానికి సినిమాల్లో ఉన్నపుడు కూడా శివాజికి ఇంతస్దాయిలో ప్రచారం జరగలేదనే చెప్పాలి.

 

దానికితోడు చంద్రబాబు కూడా పదే పదే శివాజి చెప్పిన ఆపరేషన్ గరుడను ప్రస్తావించటంతో ఇపుడందరూ శివాజి అరెస్టును డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న ఘటనలను ముందుగా చెప్పిన శివాజిని అదుపులోకి తీసుకుని విచారిస్తే చంద్రబాబు అనుమానిస్తున్న ఆ కుట్ర కోణమేదో బయటపడుతుంది కదా అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఆ దిశగా మాత్రం ఆలోచించటం లేదు లేండి. అందుకనే శివాజిని అడ్డం పెట్టుకుని ఆపరేషన్ గరుడకు సూత్రదారి చంద్రబాబే అంటూ వైసిపి నేతలు మండిపడుతున్నారు.