తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన రాజకీయం..ఇద్దరిలోనూ అభద్రతేనా ?

 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం భలే విచిత్రంగా సాగుతోంది. ఎన్నికల సమయం కాబట్టి రాజకీయం సహజంగానే స్పీడుగా ఉంటుందని అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నదానికన్నా చాలా జోరుమీదుంది. ఎలాగంటే చంద్రబాబు గురించి మాట్లాడుతూ కెసియార్ బహిరంగ సభల్లోనే థూ అని మొహం మీదే తిట్టేసుకునేంత స్ధాయికి  చేరుకునేసింది రాజకీయం. ఇక్కడ విచిత్రమేమిటంటే, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ప్రధానమంత్రి నరేంద్రమోడిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ ఏమో చంద్రబాబును బహిరంగసభల్లో నోటికొచ్చినట్లు తిట్టేస్తున్నారు. అంటే, చంద్రబాబు మోడిని తిడుతుంటే, కెసియార్ చంద్రబాబును తిడుతున్నారంతే సింపుల్.

 

ఒకరిని మరొకరు తిట్టేసుకునేదాకా  పరిస్దితి ఎందుకు దిగజారింది ? ఎందుకంటే, అభద్రత అనే చెప్పాలి.  వచ్చే ఎన్నికల్లో కెసియార్ ను గద్దె దింపాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే టిడిపికి బద్దశతృవైన కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఈ పార్టీల పొత్తులన్ని మొదట్లో లైట్ గా తీసుకున్న కెసియార్ ఇపుడు మండిపోతున్నారు. చూడబోతే గ్రౌండ్ రిపోర్టు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చినట్లుంది. అందుకనే కాంగ్రెస్, చంద్రబాబుపై చాలా అసభ్యంగా విరుచుకుపడుతున్నారు.

 

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో  చంద్రబాబును ఓడించేందుకు ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ప్రణాళికతోనే ముందుకుపోతున్నారు. దాదాపు ఏడాదిగా పాదయాత్ర పేరుతో జనాల్లో దూసుకుపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, మరోవైపు పాదయాత్ర పేరుతో జగన్ పెంచుతున్న ఒత్తిడి, ఇంకోవైపు కేంద్రం సహాయ నిరాకరణ. చివరగా తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోయిన టిడిపి. జాతీయ చానళ్ళల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తున్న సర్వే రిపోర్టులు బోనస్. ఇలా నాలుగు వైపులా సమస్యలు కమ్ముకుంటుండంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ఒకవైపు నరేంద్రమోడిపై దుమ్మెత్తిపోస్తూనే ఇంకోవైపు జగన్ పైనా విరుచుకుపడుతున్నారు.

 

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు కెసియార్ సిఫారసు చేశారు. కాబట్టి కెసియార్ ప్రతిపక్షాలను తిట్టిపోస్తున్నారు. మరి ఏపిలో చంద్రబాబు ఎందుకు తన ప్రత్యర్ధులపై అంతలా విరుచుకుపడుతున్నారు ? ఆన్సర్ వెరీ సింపుల్ అభద్రత.  వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేనపుడే ప్రత్యర్ధులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. చూడబోతే ఇటు కెసియార్ అటు చంద్రబాబు ఇద్దరిలోను అందుకేనేమో అభద్రత కనిపిస్తోంది.