తెలంగాణ రాజకీయంపై చంద్రబాబు, పవన్ సైలెన్స్ వెనుక.!

‘తెలంగాణలోనూ పోటీ చేస్తాం..’ అంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ‘తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తాం..’ అని ఈ మధ్యనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. నిజానికి, వైసీపీ కూడా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసిన పార్టీనే. ఆ తర్వాత తెలంగాణలో తమ శాఖను వదిలేసుకుంది వైసీపీ.!

సో, తెలంగాణ రాజకీయాలతో వైసీపీకి సంబంధం లేదు. కానీ, టీడీపీ అలాగే జనసేన.. తెలంగాణలోనూ రాజకీయాలు చేస్తున్నాయ్. అలాంటప్పుడు, తెలంగాణలో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగిందంటూ పెద్దయెత్తున రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ.. అటు టీడీపీ అధినేత చంద్రబాబుగానీ, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌గానీ ఎందుకు స్పందించలేదు.?

‘మొన్న ఎవరో ఇద్దరు నోవాటెల్ హోటల్ దగ్గర ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కంకణం కట్టుకున్నారు కదా.? వారిద్దరూ తెలంగాణలో ఓట్ల బేరాలపై ఇప్పుడు ఎందుకు కిక్కురుమనలేకపోతున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం..’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు టీడీపీ అధినేతనీ, జనసేన అధినేతనీ.

టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఖాయమైతే.. 2024 ఎన్నికల్లో తెలంగాణలోనూ ఆ పొత్తు వుంటుంది. తెలంగాణలో ఎటూ జనసేన పార్టీ డజను అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. టీడీపీ కూడా అంతకు మించిన సీట్లలోనే పోటీ చేస్తుంది.

మరి, తెలంగాణ రాజకీయాల్లో ఓ కుదుపులా మారిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం’ వ్యవహారంపై ఇద్దరూ ఎందుకు కిమ్మనడంలేదు.? ఓహో, గతంలో చంద్రబాబు అండ్ కో, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారు కాబట్టి అనా.? ఇంతకీ, బీజేపీకి ఎమ్మెల్యేల కొనుగోలు సలహా ఇచ్చింది టీడీపీనే ఎందుకు అవకూడదు.?