ఆత్మనిర్భర భారత్ అంటే ఇదేనా..? విమానాశ్రయాల ప్రైవేటీకరణ ఒక సాక్ష్యం 

BJP
ఆత్మనిర్భర భారత్ అంటూ మోదీ పదే పదే ఒక మంత్రం వల్లిస్తూ ఉంటారు.  కుంటుబడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఇదొక్కటే మార్గమని ప్రధాని పలు కీలక ప్రసంగాల్లో అన్నారు.  కరోనా సంక్షోభం నుండి కోలుకోవడానికి 20 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.  ఆ ప్యాకేజీతో పేద ప్రజల రాతలు మారతాయని అన్నారు.  కానీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పేదల కష్టాలు తీరలేదు.  ప్యాకేజీ ఫలాలు ఎంతమేర ప్రజలకు అందాయో ఎవ్వరికీ తెలీదు.  పేదల సంగత ఎలా ఉన్నా ప్రైవేట్ రంగాలకు ఇచ్చిన హామీలను మాత్రం త్వరితగతిన అమలుచేస్తున్నారు.  ప్యాకేజీ సమయంలో ఏ ప్రకటనలైతే చేశారో వాటిని ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసుకుంటూ పోతున్నారు. 
 
BJP
 
తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడు విమానాశ్రయాలను ప్రముఖ ప్రైవేట్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.  ఈ నిర్ణయాన్ని బీజేపీ, వారి మిత్ర పక్షాలు గొప్ప చర్యగా అభివర్ణిస్తూ ఉంటే కొన్ని స్థానిక రాజకీయ పార్టీలు మాత్రం తీవ్రంగా ఖండించాయి.  వాటిలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఉన్నారు.  ప్రభుత్వం అదానీకి అప్పగించిన విమానాశ్రయాల్లో తిరువనంతపురం విమానాశ్రయం కూడా ఉంది.  ఈ లీజు 50 ఏళ్ల వరకు ఉంటుంది.  తిరువనంతపురం విమానాశ్రయం లాభాల్లో నడిచే విమానాశ్రయం.  ప్రతి యేటా మంచి లాభాలే వస్తుంటాయి.  ఇన్నాళ్లు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ విమానాశ్రయం ఉండేది.  కానీ త్వరలో అదానీ చేతికి వెళ్లనుంది.
 
ఒక విమానాశ్రయం కట్టాలంటే దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్పనిసరిగా ఉంటుంది.  ముఖ్యంగా భూసేకరణలో.  విమానాశ్రయానికి కావల్సిన భూమిని అధిక మొత్తంలో సేకరించే భాద్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.  ప్రతిపాదించిన భూమి రైతులది, ఇతర ప్రైవేట్ వ్యక్తులదీ అయినా వారిని ఒప్పించి సేకరించాల్సింది, స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే.  ఆ సమయంలో అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్ దిగ్గజాలు ఎవరూ ముందుకురారు.  కానీ అంతా పూర్తై విమానాశ్రయం లాభాల్లో ఉన్నప్పుడు మాత్రం మేం నిర్వహిస్తాం అంటూ వచ్చేస్తారు.  కేంద్రం సైతం ప్రాథమిక దశలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వాలను విస్మరించి ప్రైవేట్ వ్యక్తలకే పెద్ద పీఠ వేస్తుంటాయి.  
 
ఇదే ఇప్పుడొచ్చిన సమస్య.  కేరళ సీఎం విజయన్ దీన్నే ప్రస్తావిస్తున్నారు.  తిరువనంతపురం విమానాశ్రయానికి కేరళ సర్కారు 2005లో 23.57 ఎకరాల భూమిని ఉచితంగా ఏఏఐకి బదలాయించింది.  స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ఏఏఐ అప్పట్లో హామీ కూడా ఇచ్చింది.  ఇప్పుడు ఆ హామీనే విస్మరించి కేంద్రం ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దింపింది.  నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఆత్మ నిర్భర భారత్ అనే నినాదాన్ని సఫలం చేయాలనే ఉద్దేశ్యం ఉంటే సగం నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి మిగిలిన తమ వాటాకు బిడ్ నిర్వహించి అందులో ప్రైవేట్ సంస్థలకి భాగస్వామ్యం ఇవ్వాలి.  అంతేకానీ మొత్తం ఇలా కట్టబెట్టడం సమజసం కానే కాదు.  
 
పోనీ విమానాశ్రయాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యం సాధ్యం కాదా అంటే అదీ నిజం కాదు.  ఎందుకంటే కేరళ సర్కార్ కొచ్చి, కన్నూర్ విమానాశ్రయాలను విజయవంతంగా నడుపుతోంది.  సరే.. ప్రైవేట్ యాజమాన్యాలు తప్పులే చేయవా అంటే అదీ గ్యారెంటీ లేదు.  విమానాశ్రయాల నిర్వహణలో మంచి పేరున్న జిఎమ్మార్ సంస్థ నిధుల దుర్వినియోగం ఉదంతాన్ని దేశం మొత్తం చూసింది.  అసలు అదానీకి ఇంతలా భాగస్వామ్యం ఇవ్వడం వెనుక బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలూ ఉన్నాయి.  అదానీ బీజేపీకి చాలా సన్నిహితమైన వ్యక్తి.  అందుకే ఈ ప్రోత్సాహం అంటున్నారు చాలామంది.  ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలి.  దాన్ని ఎవరూ కాదనరు.  కానీ రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా పక్కనబెట్టి మాత్రం కాదు.  ఈ వాస్తవాన్ని కేంద్రం గుర్తెరిగితే ఆత్మనిర్భర భారత్ అనే నినాదం కాస్తో కూస్తో సార్థకమవుతుంది.